ఆదిలాబాద్, జూలై 25
నీట్ పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారంలో విద్యార్థుల పోరాటానికి కేంద్రం తలొగ్గి, కేంద్ర మంత్రి రాజీనామా చేయడం ఒక విజయమని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. అయితే, ఈ విజయం వెనుక ఎంతో విషాదం దాగి ఉందని, పేపర్ లీకేజీల వల్ల భవిష్యత్తు దెబ్బతిన్నదనే మనస్తాపంతో ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల ఆత్మలకు శాంతి చేకూరాలని కోరుతూ ఆదిలాబాద్లో కాంగ్రెస్ పార్టీ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించింది. అమరులైన విద్యార్థులకు వారు కన్నీటి నివాళులర్పించారు.
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పిలుపు మేరకు, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సూచనలతో, డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ నరేష్ జాదవ్ ఆదేశాల మేరకు ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని గ్రంథాలయం నుంచి అంబేద్కర్ చౌక్ వరకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు శాంతియుతంగా ర్యాలీ చేపట్టారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. నీట్ పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారంపై విద్యార్థులు సాగించిన పోరాటానికి కేంద్ర ప్రభుత్వం తలొగ్గిందని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం విద్యార్థి లోకం, కాంగ్రెస్ నాయకులు సాధించిన విజయమని పేర్కొన్నారు. అయితే ఈ విజయం వెనుక ఎంతో విషాదం దాగి ఉందన్నారు.
పేపర్ లీకేజీల కారణంగా వైద్య విద్యలో తమ భవిష్యత్తు దెబ్బతిన్నదనే మనస్తాపంతో ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల ఆత్మలకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు. అమరులైన విద్యార్థులకు కాంగ్రెస్ నాయకులు కన్నీటి నివాళులు అర్పించారు.
విద్యార్థుల న్యాయం కోసం నిర్వహించిన ఆందోళనలను అణచివేసేందుకు ప్రభుత్వం ప్రయత్నించిందని, శాంతియుతంగా నిరసన తెలిపిన విద్యార్థులపై లాఠీచార్జీలు చేయడం దారుణమని కాంగ్రెస్ నాయకులు విమర్శించారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని తెలిపారు.












