చిత్తూరు, 2026-07-16
రెండేళ్ల వివాహ బంధంలో ఏడు నెలల బిడ్డ ఉండగానే, భార్య వివాహేతర సంబంధం భర్త ప్రాణాలను బలిగొంది. భార్య సహకారంతో ఆమె ప్రియుడు, అతని స్నేహితుడు కలిసి భర్తను దారుణంగా హత్య చేసిన ఘటన చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం కెనమాకులపల్లి పంచాయతీ బోయనపల్లిలో వెలుగుచూసింది. ఈ ఘటనతో పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చి, భార్య, ప్రియుడు, అతని స్నేహితుడిపై కేసు నమోదు చేశారు.
వివాహ బంధానికి వివాహేతర సంబంధం కాలనాగులా మారి భర్త ప్రాణాలను బలిగొంది. భార్య సహకారంతో ఆమె ప్రియుడు, అతని స్నేహితుడు కలిసి భర్తను దారుణంగా హత్య చేశారు. రెండేళ్లు కూడా నిండని వివాహ బంధంలో ఏడు నెలల బిడ్డ ఉండగానే ఈ ఘోరం జరిగింది. బంధువులు అన్యోన్యంగా ఉన్నారని భావించిన కాపురం ఇలా కుప్పకూలింది.
శాంతిపురం మండలం కెనమాకులపల్లి పంచాయతీ బోయనపల్లికి చెందిన యువతికి రెండేళ్ల క్రితం తమిళనాడులోని సూలగిరికి చెందిన రమేష్‌తో పెద్దలు వివాహం చేశారు. ఏడు నెలల క్రితం వారికి ఆడ బిడ్డ జన్మించింది. రెండు నెలల క్రితం భార్య పుట్టింటికి వెళ్లింది. ఈ క్రమంలో ఆమెకు పుట్టిన ఊరిలో మరో యువకుడితో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసినట్లు తెలిసింది. తమ బంధానికి అడ్డుగా ఉన్న భర్త రమేష్‌ను అడ్డుతప్పించుకోవాలని భార్య ప్రియుడితో కలిసి పథకం పన్నింది.
రెండు రోజుల క్రితం భార్య భర్తతో కలిసి పుట్టింటికి వచ్చింది. మంగళవారం భర్త, బిడ్డతో కలిసి గుడుపల్లి మండలంలోని మల్లప్ప కొండపై ఉన్న మల్లేశ్వరస్వామి ఆలయానికి వెళ్లారు. ఈ విషయాన్ని ముందుగానే ప్రియుడికి చేరవేసింది. అతను తన స్నేహితుడితో కలిసి మల్లప్పకొండపై ఆలయానికి వెళ్లే మార్గంలో కాపు కాసి బైకును అడ్డుకున్నట్లు తెలిసింది. దాడి జరుగుతోందని గమనించిన రమేష్ తప్పించుకుని పారిపోయే ప్రయత్నంలో రోడ్డు నుంచి దాదాపు 100 మీటర్లు తనను వెంబడించిన ప్రియుడు, తన స్నేహితుడు విచక్షణారహితంగా నరికినట్లు సంఘటనా స్థలంలో పరిస్థితులను బట్టి తెలుస్తోంది. హత్య అనంతరం యువతి, తన ప్రియుడు, ప్రియుడి స్నేహితుడు కలిసి మృతుడికి చెందిన బైకుపైనే వెళ్లిపోయినట్లు సమాచారం.
చంటి బిడ్డతో గుడికి వెళ్లిన దంపతులు తిరిగిరాకపోవడంతో బంధువులు గాలించినా ప్రయోజనం లేకపోయింది. వారు పోలీసులను ఆశ్రయించారు. అదే సమయంలో మల్లప్ప కొండపై శవం ఉందనే సమాచారం రావడంతో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. యువతి తన భర్తతో కలిసి మల్లప్ప కొండ వైపు వెళ్తున్న దృశ్యాలను సీసీటీవీ పుటేజీల్లో గుర్తించారు. భర్త శవం దొరకడంతో భార్య, బిడ్డ ఏమయ్యారని ఆరా తీశారు. ఈ నేపథ్యంలో ఇద్దరు వ్యక్తులతో కలిసి యువతి బైకుపై వెళుతున్నట్టు సీసీ టీవీల్లో తేలింది. భార్య, తన ప్రియుడు మరో వ్యక్తితో కలిసి రమేష్‌ను హతమార్చినట్టు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. దీనిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
భర్త హత్య కేసులో నిందితురాలిగా ఉన్న యువతి ఇంకా మైనర్ అని బోయనపల్లి గ్రామస్తులు తెలిపారు. రెండేళ్ల క్రితం తను 9వ తరగతి చదువుతుండగానే ఈ బాలికకు పెద్దలు పెళ్లి చేశారని పేర్కొన్నారు.











