అహ్మదాబాద్ (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 01
గుజరాత్ లోని అహ్మదాబాద్ నగరంలో పుస్తకాలు చదువుకుంటున్న యువతపై విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ మూకలు దాడులకు తెగబడ్డాయి. జాతీయ గీతం ఆలపిస్తున్నా దాడులు ఆగకపోవడం కలకలం సృష్టించింది. ఈ ఘటన చదువుకునే హక్కుపై, ఆలోచించే స్వేచ్ఛపై జరిగిన దాడిగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఆలోచనలను అక్షరాల్లో పొందుపరిచే యువతపై మతోన్మాదులు దాడి చేశారు. గుజరాత్ లోని అహ్మదాబాద్ నగరంలో సైలెంట్ పార్కులో ప్రశాంతంగా పుస్తకాలు చదువుకుంటున్న స్టూడెంట్స్ అండ్ యూత్ కలెక్టివ్, గుజరాత్ రీడ్స్ ఎనీవే ప్రతినిధులపై విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ మూకలు దాడులకు తెగబడ్డాయి. ఇది కేవలం కొందరు విద్యార్థులపై జరిగిన దాడి కాదు.. చదువుకునే హక్కుపై, ఆలోచించే స్వేచ్ఛపై, భిన్న ఆలోచనలపై జరిగిన దాడిగా విమర్శకులు అభివర్ణిస్తున్నారు. బేస్బాల్ బ్యాట్లు, పెద్ద కర్రలు, కాషాయ జెండాల్లో చుట్టిన ఇనుప రాడ్లతో ఆ మూకలు విరుచుకుపడ్డాయి. అంతటితో ఆగకుండా అక్కడున్న ముగ్గురు ముస్లిం విద్యార్థులను ప్రత్యేకంగా పక్కకు లాక్కెళ్లి అవమానించారు. మేం భారతీయులమే అని ఎంత మొరపెట్టుకున్నా వారు కనికరించలేదు. చివరకు వారు తమ దేశభక్తిని నిరూపించుకునేందుకు జాతీయ గీతాన్ని ఆలపించారు. కానీ, కసాయి గుండెలు కరగలేదు. ఆ గీతంలోని పవిత్రత గానీ, కళ్లలోని భయం గానీ వారికి కనపడలేదు.
ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలనే అక్షర దాహం ఆ యువకులది. అది వారికి భిన్న ఆలోచనలను పంచుకునే వేదిక. ఆ సాయంత్రం అహ్మదాబాద్ సైలెంట్ పార్కులో కనిపించిన దృశ్యం ఇదే. అక్కడ విద్యార్థులు, యువత కలిసి పుస్తకాలు చదువుకుంటున్నారు. వారి చేతుల్లో ఉన్నది కూడా నోబెల్ పురస్కారం పొందిన మలాలా జీవిత జ్ఞాపకం ఐ యామ్ మలాలా.. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన భగత్ సింగ్ నెత్తుటి అక్షరాలు.. రాజ్యాంగ శిల్పి బి.ఆర్. అంబేడ్కర్ సమతా భావాలు.. భారతదేశ తొలి ప్రధాని నెహ్రూ స్వప్నాలు.. నాజీల క్రూరత్వం మధ్య సైతం మానవత్వంపై ఆశను వదలని యాన్ ఫ్రాంక్ ది డైరీ ఆఫ్ ఎ యంగ్ గర్ల్.. ఆ గొప్ప పుస్తకాల పేజీలను తిరగేస్తూ ఒకరికొకరు ఆలోచనలు పంచుకుంటున్నారు. ఆ ఆలోచనలే సంఘర్షణకు దారితీసి, మతోన్మాదాన్ని భయపెట్టాయని విశ్లేషకులు భావిస్తున్నారు. పుస్తకం ప్రశ్నించడం నేర్పుతుంది. ప్రశ్నించే వ్యక్తి మూఢనమ్మకాలను, విద్వేషాన్ని, అసమానతను అంగీకరించడు. అందుకే ఆలోచనలపై దాడి చేసే శక్తులు ముందుగా పుస్తకాన్నే లక్ష్యంగా చేసుకుంటాయి. అందుకే ప్రశాంతంగా చదువుకుంటున్న ఆ యువతపై కాశ్మీర్ వ్యతిరేకులు, తీవ్రవాదులు అంటూ ముద్రలు వేస్తూ దండెత్తారు. జై శ్రీరామ్ నినాదాన్ని సైతం బెదిరింపు ఆయుధంగా మార్చేశారు.
ఈ దారుణ దుశ్చర్య వెనుక స్పష్టమైన సంఘ్ పరివార్ కుట్ర కోణం దాగి ఉందని ఆరోపణలు వస్తున్నాయి. భిన్నత్వాన్ని, సత్యాన్ని మోసే ఈ పుస్తకాలు వారి విద్వేష రాజ్యానికి ఏనాడూ మింగుడుపడవు. అందుకే పథకం ప్రకారమే దాడులకు తెగబడ్డారని విమర్శకులు పేర్కొంటున్నారు. నోబెల్ పురస్కారం పొందిన మలాలాను పాకిస్థానీ అమ్మాయి అంటూ ఎద్దేవా చేయడం, కానీ ఆమె నిలబడింది మత ఛాందసత్వానికి ఎదురొడ్డి. ఆ ఛాందసవాదాన్ని వ్యతిరేకించే స్వరం ఒక ముస్లిం అమ్మాయిది కావడం, ఆ పేరు వినపడటమే సంఘ్ మూకలలో కడుపుమంటను రేపింది. ఎన్నికల లాభాల కోసం బీజేపీ తరచూ అంబేడ్కర్ పేరును జపిస్తున్నప్పటికీ, సామాజిక న్యాయాన్ని కోరే అంబేడ్కర్ సిద్ధాంతాల పట్ల వారికి ఏనాడూ ఆత్మీయత లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దాదాపు పన్నెండేండ్లుగా విష ప్రచారాన్ని నింపిన అధికార పీఠానికి, నెహ్రూ అంటే పెరిగిన అసూయ స్పష్టంగానే ఉంది. భగత్ సింగ్ నేర్పిన విప్లవం వారి హిందూత్వ ఎజెండాకు శత్రువు. అందుకే ఆలోచనలు వికసించే ఏ పుస్తకాన్నీ వాళ్లు భరించలేక పోతున్నారు.












