ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని దక్షిణముఖి హనుమాన్ మందిర ఆలయ ప్రాంగణంలో జరిగిన పౌర్ణిమ అన్నదాన కార్యక్రమంలో పురపాలక సంఘం అధ్యక్షురాలు బండారి అనూష సతీష్ ను ఆలయ కమిటీ సభ్యులు సన్మానించారు. ఆలయ అభివృద్ధికి 5 లక్షల రూపాయల షెడ్ నిర్మాణం మంజూరు చేస్తామని ఆమె హామీ ఇచ్చారు.
శ్రీరామదూత సుందరకాండ మిత్రమండలి ఆధ్వర్యంలో ఆదిలాబాద్ లోని సుందరయ్య నగర్ దక్షిణముఖి దికక్షా హనుమాన్ మందిరంలో పౌర్ణిమ అన్నదాన వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆదిలాబాద్ పురపాలక సంఘం అధ్యక్షురాలు బండారి అనూష సతీష్ ను ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు.
ఆలయ కమిటీ సభ్యులు అనూష సతీష్ ను శాలువాలతో సత్కరించారు. ఆలయ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని, ముఖ్యంగా ఆలయ ప్రాంగణంలో షెడ్ నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలు మంజూరు చేయిస్తానని ఆమె హామీ ఇచ్చారు. ఈ మేరకు జిల్లా కాంగ్రెస్ అసెంబ్లీ ఇన్చార్జి కంది శ్రీనివాస్ రెడ్డితో మాట్లాడతానని తెలిపారు.
గత కొన్నేళ్లుగా శ్రీరామదూత సుందరకాండ మిత్రమండలి సభ్యులు చేస్తున్న సామాజిక సేవ, ఆలయ అభివృద్ధికి వారి కృషిని అనూష ప్రశంసించారు. ప్రతి శనివారం, మంగళవారం సాయంత్రం సుందరకాండ పారాయణం, ప్రతి పౌర్ణిమ రోజు 24 గంటల పాటు సుందరకాండ పారాయణం, అనంతరం అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం గొప్ప కార్యమని ఆమె కొనియాడారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు విగ్నేశ్వర్, సభ్యులు, పంతులు, భక్తులు పాల్గొన్నారు. అనంతరం 500 మందికి అన్నదాన వితరణ కార్యక్రమం జరిగింది.












