ముంబై (మనోరంజని తెలుగు టైమ్స్) ఆగస్టు 30
తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యావేత్త, పద్మశ్రీ పురస్కార గ్రహీత, ఎస్.వి. విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి ఆచార్య కొలకలూరి ఇనాక్, ముంబైలోని బాబాసాహెబ్ అంబేద్కర్ సమాధి అయిన చైత్యభూమి, ఆయన పుస్తక నిలయమైన రాజగృహలను సందర్శించారు. శనివారం ఆయన తెలుగు భాష - సాహిత్యం కార్యక్రమానికి హాజరయ్యారు.
తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యావేత్త, పద్మశ్రీ పురస్కార గ్రహీత, ప్రముఖ ఎస్.వి. విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి, కవి, రచయిత, దళితబహుజన బంధువు ఆచార్య కొలకలూరి ఇనాక్, ముంబైలోని బాబాసాహెబ్ అంబేద్కర్ సమాధి అయిన చైత్యభూమి, ఆయన పుస్తక నిలయమైన రాజగృహలను తన కుమారుడితో కలిసి సందర్శించారు.
శనివారం ముంబైలోని ఆంధ్ర మహాసభ వారు ఏర్పాటు చేసిన తెలుగు భాష - సాహిత్యం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసారు. ఆదివారం నగరంలోని పలు అంబేద్కర్వాద సంఘాల ప్రతినిధులు ఆయనతో సమావేశమై, చారిత్రాత్మక రాజగృహ, చైత్యభూమిలను సందర్శించడానికి తీసుకెళ్లారు.
ఈ సందర్భంగా ప్రముఖులు నాగెళ్ల దేవానంద్, బత్తుల లింగం, మేడి తిరుపతి గంగపుత్ర, మందారపు రమేష్ రజక, ఏనుగంటి నరేందర్, భీంరత్న మాలజీ, కె.రంగారాజు, గుర్రం నరేష్, మూలనివాసి మాలజీలు రాజగృహం వద్ద అతిథులకు స్వాగతం పలికి, చైత్యభూమి వద్ద జైభీమ్ కలము ఇచ్చి, నీలి కండువాలతో ఘనంగా సత్కరించారు.
ముఖ్యంగా మహారాష్ట్రలో బాబాసాహెబ్ అంబేద్కర్ పోరాటాలు, వారి కుటుంబ నేపథ్య విషయాలపై చర్చించారు. చివరగా, మేధావి ఇనాక్ గురించి కవి, రచయిత నాగేళ్ల దేవానంద్ ముంబై వాసులకు పరిచయం చేశారు.












