Nirmal/Mamda (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 28
ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షపాతం తగ్గుముఖం పట్టనున్న నేపథ్యంలో, రైతులు ఆరుతడి పంటల సాగు వైపు మళ్లేలా ప్రోత్సహించాలని, విపత్తుల సమయంలో అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజూ కలెక్టర్లను ఆదేశించారు. మంగళవారం ఆయన నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్ లో ఈ మేరకు సూచనలు జారీ చేశారు.
ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వర్షపాతం తగ్గుతున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, రైతులు పరిస్థితులకు అనుగుణంగా పంటల మార్పిడి పద్ధతులు అవలంబించేలా అవగాహన కల్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజూ కలెక్టర్లను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం సీఎస్, ఎల్ నినో ప్రభావం, ప్రత్యామ్నాయ, ఆరుతడి పంటల సాగు, విపత్తుల నిర్వహణ తదితర అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎల్ నినో ప్రభావంతో వర్షపాతం తగ్గే అవకాశం ఉన్న నేపథ్యంలో, ప్రభావాన్ని ముందుగానే అంచనా వేసి, రైతులకు ప్రత్యామ్నాయ పంటల సాగుపై సూచనలు అందించాలని తెలిపారు. తక్కువ నీటి వినియోగంతో సాగు చేయగల పంటలను ప్రోత్సహించాలని, రైతులు ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా పంటలను మార్చుకునేలా క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు.
క్షేత్రస్థాయిలో ఎలాంటి విపత్తులు సంభవించినా వెంటనే స్పందించేలా అధికారులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. విపత్తులు సంభవించినప్పుడు చేపట్టాల్సిన చర్యలు, తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరం నుంచి జరిగిన ఈ టెలీ కాన్ఫరెన్స్ లో కలెక్టర్ భవేశ్ మిశ్రా, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. వెంకటేశ్వర్లు, సీపీఓ గంగారెడ్డి, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.












