నిమిష ప్రియ ఉరిశిక్ష రద్దు వార్తలు అవాస్తవం!
వ్యాపార భాగస్వామి హత్య కేసులో నిమిష ప్రియకు ఉరిశిక్ష
భారత ప్రభుత్వ దౌత్యంతో శిక్ష తాత్కాలికంగా నిలుపుదల
ఉరిశిక్షను పూర్తిగా రద్దు చేసినట్టు ఏపీ అబూబక్కర్ ముస్లియార్ కార్యాలయం ప్రకటన
అటువంటిదేమీ లేదని ఖండించిన భారత ప్రభుత్వం
హత్య కేసులో దోషిగా తేలిన కేరళ నర్సు నిమిష ప్రియ ఉరిశిక్ష రద్దయిందంటూ వస్తున్న వార్తలను భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. “నిమిషా ప్రియ కేసుపై కొందరు వ్యక్తులు పంచుకుంటున్న సమాచారం పూర్తిగా తప్పు” అని భారత విదేశాంగ మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది.
నిమిష ప్రియ ఉరిశిక్ష అధికారికంగా రద్దు అయిందని ఇండియా గ్రాండ్ ముఫ్తీ కంథాపురం ఏపీ అబూబక్కర్ ముస్లియార్ కార్యాలయం ప్రకటించింది. “నిమిష ప్రియ మరణశిక్ష ఇంతకు ముందు తాత్కాలికంగా సస్పెండ్ అయింది. ఇప్పుడు పూర్తిగా రద్దు అయింది. యెమెన్ రాజధాని సనాలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు” అని గ్రాండ్ ముఫ్తీ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే, యెమెన్ ప్రభుత్వం నుంచి అధికారిక రాతపూర్వక నిర్ధారణ ఇంకా అందలేదని కార్యాలయం స్పష్టం చేసింది. అయితే, ప్రకటనను భారత ప్రభుత్వం ఈ వార్తలను ఖండించింది. బాధితుడి కుటుంబం నుంచి పూర్తి ఏకాభిప్రాయం లభించకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది.
కేరళలోని పాలక్కాడ్ జిల్లాకు చెందిన 38 ఏళ్ల నర్సు నిమిష ప్రియ మెరుగైన ఉపాధి కోసం 2008లో యెమెన్‌కు వెళ్లారు. అక్కడ ఆమె సొంత క్లినిక్ ప్రారంభించేందుకు యెమెన్‌కు చెందిన వ్యాపారవేత్త తలాల్ అబ్దో మహ్దీతో భాగస్వామ్యం కుదుర్చుకున్నారు. అయితే, ఈ భాగస్వామ్యం కాలక్రమేణా వివాదాస్పదంగా మారింది. మహ్దీ తన పాస్‌పోర్ట్‌ను జప్తు చేశారని, తనను దారుణంగా హింసించారని, క్లినిక్ ఆదాయాన్ని దుర్వినియోగం చేశారని నిమిష ఆరోపించారు.
2017లో తన పాస్‌పోర్ట్‌ను తిరిగి పొందేందుకు మహ్దీకి సెడేటివ్స్ ఇంజెక్ట్ చేసింది. ఈ ప్రయత్నం దురదృష్టవశాత్తు మహ్దీ మరణానికి దారితీసింది. ఆ తర్వాత, ఆమె ఆయన శరీరాన్ని ముక్కలుగా చేసి, వాటర్ ట్యాంక్‌లో పడవేసింది. ఈ కేసులో 2018లో అరెస్టు అయిన నిమిష ఆ తర్వాత దోషిగా తేలింది. 2020లో సనా ట్రయల్ కోర్టు ఆమెకు ఉరిశిక్ష విధించింది. 2023లో యెమెన్ సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ ఆమె అప్పీల్‌ను తిరస్కరించింది.
ఈ ఏడాది జులై 16న నిమిష ప్రియ ఉరిశిక్ష అమలు కావాల్సి ఉండగా, గ్రాండ్ ముఫ్తీ ముస్లియార్ యెమెన్ అధికారులకు చేసిన విజ్ఞప్తి, భారత ప్రభుత్వ దౌత్యపరమైన జోక్యంతో ఈ శిక్షను తాత్కాలికంగా నిలిపివేశారు. తాజాగా ఈ శిక్ష పూర్తిగా రద్దు అయినట్టు వార్తలు వచ్చాయి. యెమెన్ కార్యకర్త సర్హాన్ షమ్సన్ అల్ విస్వాబీ కూడా ఫేస్‌బుక్ పోస్ట్‌లో ఈ శిక్ష రద్దు అయిందని, నిమిష ఇప్పుడు జీవిత ఖైదు లేదా “బ్లడ్ మనీ” (బాధితుడి కుటుంబానికి నష్టపరిహారం) చెల్లింపు ద్వారా విడుదల అయ్యే అవకాశం ఉందని పేర్కొన్నాడు. కానీ, ఈ వార్తలను భారత ప్రభుత్వం ఖండించింది