పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో, ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హోర్ముజ్ జలసంధి వద్ద భారతీయ నౌకలు సాహసోపేతమైన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి. యుద్ధ వాతావరణం ఉన్నప్పటికీ, భారతీయ జెండాతో ప్రయాణిస్తున్న నౌకలు క్షేమంగా స్వదేశానికి చేరుకుంటున్నాయి.
శుక్రవారం, భారతీయ జెండా కలిగిన ఏడవ ఎల్పీజీ ట్యాంకర్ 'గ్రీన్ సాన్వి' విజయవంతంగా హోర్ముజ్ జలసంధిని దాటింది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు ఆరు భారతీయ నౌకలు ఈ ప్రమాదకరమైన జలసంధిని దాటి క్షేమంగా భారత ఓడరేవులకు చేరుకున్నాయని తెలుస్తోంది. భారత నౌకాదళం అందిస్తున్న సూచనలు, రక్షణ కవచం ఈ విజయానికి దోహదపడుతున్నాయని అధికారులు తెలిపారు.
ప్రస్తుతం, హోర్ముజ్ జలసంధికి పశ్చిమ దిశలో సుమారు 17 భారతీయ నౌకలు నిలిచిపోయాయి. వీటిలో ఎల్పీజీతో నిండిన 'గ్రీన్ ఆశా' మరియు 'జగ్ విక్రమ్' అనే రెండు కీలక నౌకలు ఉన్నాయి. పర్షియన్ గల్ఫ్‌లోని అబు మూసా ద్వీపం సమీపంలో ఈ నౌకలు భారత నౌకాదళం నుండి తదుపరి సూచనల కోసం ఎదురుచూస్తున్నాయి. ఈ నౌకలు ఏ క్షణమైనా భారతదేశం వైపు ప్రయాణం ప్రారంభించే అవకాశం ఉందని సమాచారం.
ఈ నేపథ్యంలో, ఒక ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. ఆరేళ్ల తర్వాత తొలిసారిగా ఇరాన్ నుండి భారత్‌కు ముడి చమురు తీసుకువస్తోందని భావిస్తున్న 'పింగ్ షున్' అనే విదేశీ ట్యాంకర్ తన గమ్యాన్ని అకస్మాత్తుగా మార్చుకుంది. మొదట గుజరాత్‌లోని వడినార్ పోర్టుకు రావాల్సి ఉండగా, ప్రస్తుతం అది చైనాలోని డోంగింగ్ వైపు వెళ్తున్నట్లు సమాచారం.
విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ఈ మార్పు కేవలం యుద్ధ భయం వల్లనే కాకుండా, చెల్లింపుల సమస్యల వల్ల కూడా జరిగి ఉండవచ్చు. గతంలో ఉన్న 30-60 రోజుల అప్పు సౌకర్యాన్ని పక్కన పెట్టి, ఇరాన్ విక్రేతలు ఇప్పుడు ముందస్తు చెల్లింపులు కోరుతున్నారని, ఈ ఆర్థిక నిబంధనల వల్లే నౌకలు గమ్యస్థానాలను మార్చుకుంటున్నాయని తెలుస్తోంది. ఒకవేళ చెల్లింపుల సమస్య పరిష్కారమైతే, ఆ 6 లక్షల బ్యారెళ్ల చమురు మళ్లీ భారత రిఫైనరీలకే వచ్చే అవకాశం ఉంది. ముడి చమురు ధరలు పెరగకుండా, దేశంలో ఇంధన కొరత రాకుండా భారత ప్రభుత్వం, నౌకాదళం అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి.












