లింగాపూర్‌లో భారీ బంగారం చోరీ… పోలీసులకు సవాల్‌గా మారిన కేసు
-
ఇందల్వాయి మండలం లింగాపూర్ గ్రామంలో బంగారం, వెండి చోరీ
-
8 తులాల బంగారం, 25 తులాల వెండి దొంగిలింపు
-
ఇంట్లో తాళం, గొళ్ళెం అలాగే ఉండడం అనుమానాస్పదం
-
క్లూజ్ టీమ్ వేలిముద్రలు సేకరించినా దర్యాప్తు నెమ్మదిగా సాగుతోందని బాధితుల వాపో
-
బాధితుల ఫోన్‌కు స్పందించడం లేదని ఎస్సైపై ఆరోపణ
నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం లింగాపూర్ గ్రామంలో జరిగిన బంగారం చోరీ కేసు పోలీసులకు సవాల్‌గా మారింది. తాళం, గొళ్ళెం అలాగే ఉండగానే ఇంట్లోంచి 8 తులాల బంగారం, 25 తులాల వెండి దొంగిలించారు. బాధితురాలు మూడేడ్ల అపర్ణ ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ ప్రారంభించారు. క్లూజ్ టీమ్ విచారణ అనంతరం ఇప్పటివరకు ఎలాంటి పురోగతి లేకపోవడంతో బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇందల్వాయి మండలంలోని లింగాపూర్ గ్రామంలో అతి చాకచక్యంగా దొంగలు బీభత్సం సృష్టించారు. మూడేడ్ల అపర్ణ అనే మహిళ ఇంట్లో గొళ్ళెం వేసి బయటకు వెళ్లగా, ఆ సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి బీర్వాను తెరిచి 8 తులాల బంగారం, 25 తులాల వెండి నగలు దొంగిలించారు.
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే — ఇంటికి వేసిన తాళం, గొళ్ళెం అలాగే ఉండటం, “ఎవరైనా తాళం చెవిని ఉపయోగించారేమో?” అనే అనుమానాలకు తావు కల్పించింది.
సమాచారం అందుకున్న ఇందల్వాయి ఎస్సై సిబ్బందితో సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం క్లూజ్ టీమ్ వచ్చి వేలిముద్రలను సేకరించింది. గ్రామస్థుల సమక్షంలో “రెండు రోజుల్లో దొంగలను పట్టుకుంటాం” అని హామీ ఇచ్చినప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి పురోగతి కనిపించలేదని బాధితురాలు మూడేడ్ల అపర్ణ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక బాధిత కుటుంబం చెబుతున్నదేమిటంటే —
“ఎస్సై గారికి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు. పోలీస్ విచారణలో కాలయాపన జరుగుతోంది. మా బంగారం దొంగలను ఎప్పుడు పట్టుకుంటారో తెలియదు.”
గ్రామస్థులు కూడా ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, “ఇంత చిన్న గ్రామంలో ఇంత పెద్ద చోరీ జరగడం పోలీసు శాఖకు సవాల్” అని పేర్కొన్నారు.
పోలీసులు దొంగలను పట్టుకునేందుకు చర్యలు వేగవంతం చేయాలని బాధితులు కోరుతున్నారు.