ఆదిలాబాద్ రిమ్స్ హాస్పిటల్లో ఎమ్మెల్యే పాయల్ శంకర్ మంగళవారం ఆకస్మిక తనిఖీ నిర్వహించి, రోగులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.
ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆసుపత్రిలోని పలు విభాగాలను స్వయంగా పరిశీలించి, రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ఓపీ వార్డులు, ఐసీయూ, జనరల్ వార్డులు, ఫార్మసీ, డయాగ్నోస్టిక్ ల్యాబ్లను సందర్శించారు.
రోగులతో నేరుగా మాట్లాడి, ఆసుపత్రిలో అందుతున్న సౌకర్యాలు, వైద్యులు, సిబ్బంది స్పందన, మందుల లభ్యత గురించి అడిగి తెలుసుకున్నారు. పారిశుధ్యం, మంచినీటి వసతి, పడకల నిర్వహణ వంటి అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు.
అనంతరం ఆసుపత్రి సూపరింటెండెంట్, వైద్య సిబ్బందితో సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే, రోగులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నాణ్యమైన వైద్యం అందించాలని సూచించారు. వైద్యులు సమయపాలన పాటించాలని, ప్రభుత్వ ఆసుపత్రిపై ప్రజలకు నమ్మకం పెంచేలా సేవలు ఉండాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు బోడిగం శ్రీకాంత్, కృష్ణ యాదవ్, బీజేపీ పట్టణ నాయకులు, కార్యకర్తలు కూడా పాల్గొన్నారు.












