ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్మల్ జిల్లా ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి మాట్లాడుతూ, నర్సింగ్ వృత్తి అత్యంత గౌరవప్రదమైనదని, రోగుల పట్ల సేవా దృక్పథంతో పనిచేసే ఈ వృత్తిని ఎంతోమంది ఆకాంక్షిస్తారని తెలిపారు.
ప్రభుత్వ నర్సింగ్ కళాశాల నుండి దాదాపు 120 మంది విద్యార్థులు త్వరలో నర్సింగ్ వృత్తిలోకి అడుగుపెట్టనున్నారని, ఇది సంతోషకరమైన విషయమని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత తరుణంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల అవగాహన కలిగి ఉండటం అత్యవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.
యువత గంజాయి వంటి మత్తు పదార్థాలకు ఆకర్షితులవడం దురదృష్టకరమని, మాదకద్రవ్యాల వల్ల కలిగే నష్టాలపై ప్రజలను చైతన్యపరచాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని చక్రవర్తి అన్నారు. ఆరోగ్యంపై అవగాహనతో పాటు, యువతను చెడు వ్యసనాల నుండి దూరం చేయాల్సిన ఆవశ్యకతను ఆయన నొక్కి చెప్పారు.
ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ అధికారి డాక్టర్ రాజేందర్, డిప్యూటీ డి.ఎం.అండ్ హెచ్.ఓ పవన్, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ శకుంతల, కౌన్సిలర్ ఎస్.పి.రాజు, కొండాజీ రాఘవేంద్ర చారి తదితరులు పాల్గొన్నారు.











