రాష్ట్రవ్యాప్తంగా మామిడి పండ్ల పేరుతో వినియోగదారులను మోసం చేస్తున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. పచ్చి మామిడి కాయలను కృత్రిమంగా మగ్గబెట్టి, రంగు మార్చి విక్రయిస్తున్నారని, ఇది ప్రజల ఆరోగ్యానికి తీవ్ర హాని కలిగిస్తుందని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ నాయకులు మేడా శ్రీనివాస్ ఆరోపించారు.
పసుపు పచ్చగా, అందంగా కనిపించే మామిడి పండ్లను కొని ప్రజలు అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారని మేడా శ్రీనివాస్ తెలిపారు. పచ్చి మామిడి కాయల మధ్య ఇథిలీన్ రసాయన పేపర్లను ఉంచి, వాటిని కృత్రిమంగా మగ్గబెట్టి, రంగు మార్చి వినియోగదారులకు విక్రయిస్తున్నారని ఆయన వివరించారు. ఈ పద్ధతి ప్రజల ఆరోగ్యానికి తీవ్ర హాని కలిగిస్తుందని ఆయన హెచ్చరించారు.
బహిరంగంగా రసాయనాలతో పండించిన మామిడి పండ్లను మార్కెట్లో విక్రయిస్తున్నప్పటికీ, సంబంధిత విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్, ఫుడ్ సేఫ్టీ వంటి ప్రభుత్వ శాఖలు అవినీతికి పాల్పడుతూ చోద్యం చూస్తున్నాయని మేడా శ్రీనివాస్ ఆరోపించారు. ప్రభుత్వ విధులను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రభుత్వ శాఖలు ప్రజలకు ఉపయోగపడకుండా పోతున్నాయని, కృత్రిమంగా మగ్గబెట్టిన పండ్లను విక్రయించడం ద్వారా ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
పాలకులు ఈ వ్యవహారాన్ని నిమ్మకు నీరెత్తినట్లు చూడటం వారి అసమర్థతను, అవినీతిని చాటుతోందని ఆయన విమర్శించారు. ప్రధాన కార్పొరేట్ మీడియా కూడా ఈ తరహా మోసాలను పట్టించుకోకపోవడం బాధాకరమని, ఇది సమాజానికి ఉగ్రవాదం కన్నా పెను ప్రమాదంగా మారే అవకాశం ఉందని మేడా శ్రీనివాస్ అన్నారు. ఆహారం కలుషితం, ప్రభుత్వ విధులు అవినీతిమయం, పాలన మోసం, సామాజిక భద్రత ఆవిరిమయం అవుతున్నాయని, ప్రజల జీవన భద్రత ఎలాగని ఆయన ప్రశ్నించారు.
ప్రజల ఆరోగ్య భద్రతను కాపాడే దిశగా ప్రభుత్వ విధులు అమలు కాకపోతే, అవినీతి అధికారులు ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని ఆయన హెచ్చరించారు. ఈ వ్యవహారంపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.












