తానూర్, జులై 28
తానూర్ మండలంలోని ఝరి బి గ్రామంలో డెంగ్యూ నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు గైక్వాడ్ సాయినాథ్, ఆశ వర్కర్ మైనా బాయి పాల్గొన్నారు. వర్షాకాలంలో డెంగ్యూ వ్యాప్తి చెందకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పరిసరాల పరిశుభ్రత పాటించాలని సూచించారు.
గ్రామాల్లో డెంగ్యూ వ్యాధి వ్యాపించకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పరిసరాల పరిశుభ్రత పాటించాలని కాంగ్రెస్ పార్టీ తానూర్ మండలం యువ నాయకుడు గైక్వాడ్ సాయినాథ్ పేర్కొన్నారు. మంగళవారం తానూర్ మండలంలోని ఝరి బి గ్రామంలో ఆశ వర్కర్ మైనా బాయి తో కలిసి ఆయన ఇంటింటికీ తిరుగుతూ డెంగ్యూ నివారణ చర్యలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా గైక్వాడ్ సాయినాథ్ మాట్లాడుతూ.. వర్షాకాలంలో రోగాలు వ్యాపించే ప్రమాదం ఉందని, ప్రతి ఒక్కరూ తమ ఇళ్లతో పాటు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఇళ్లలోని పూల కుండీలు, పాత టైర్లు, రోకలి బండలు, ఇతర పాత్రలలో నీరు ఎక్కువ రోజులు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు. నిల్వ నీటిలోనే డెంగ్యూ వ్యాప్తి చెందించే దోమలు వృద్ధి చెందుతాయని, కాబట్టి ఎప్పటికప్పుడు ఆ నీటిని పారబోయాలని విజ్ఞప్తి చేశారు. జ్వరం వస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ప్రభుత్వ దవాఖానను సంప్రదించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన గుర్ల దిగంబర్, బేర్జే విట్టల్, పలువురు మహిళలు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.











