పెరుగుతున్న జనాభా దృష్ట్యా ప్రజారోగ్యాన్ని మెరుగుపరిచేందుకు భైంసా ఏరియా ఆసుపత్రిని 100 పడకల నుంచి 150 పడకలకు పెంచాలని, అలాగే 100 పడకల మెటర్నటీ ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహను కోరారు. హైదరాబాదులో జరిగిన సమీక్ష సమావేశంలో ఈ విజ్ఞప్తులు చేశారు.
పెరుగుతున్న జనాభా దృష్ట్యా ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని భైంసా ఏరియా ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రి నుంచి 150 పడకల ఆసుపత్రిగా మార్చాలని ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహను కోరారు. సోమవారం హైదరాబాదులో ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలతో ఆరోగ్య శాఖ మంత్రి నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన ఈ మేరకు విజ్ఞప్తి చేశారు.
అదేవిధంగా, బైంసాలో 100 పడకలతో మెటర్నటీ హాస్పిటల్ ఏర్పాటు చేస్తే ఈ ప్రాంత వాసులకు సౌకర్యంగా ఉంటుందని పటేల్ తెలిపారు. భైంసా ఏరియా ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్లో ఐదు బెడ్స్ నుండి పది బెడ్స్ గా మార్చి మరింత సేవలు అందేటట్లు చూడాలని కోరారు.
కుబీర్ మండలంలో ఎక్కువ గ్రామాలు, గిరిజనులు అధికంగా ఉన్నందున, కుబీర్ ఆస్పత్రిని 30 పడకల ఆసుపత్రిగా మార్చాల్సిందిగా సమీక్షలో సూచించారు. ముధోల్ ఆసుపత్రి భవన నిర్మాణం గత కొన్నాళ్లుగా పెండింగ్ లో ఉందని, భవన నిర్మాణాన్ని ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తేవాల్సిందిగా కోరారు.
అదేవిధంగా, ఏరియా ఆసుపత్రితో పాటు నియోజకవర్గంలో ఖాళీగా ఉన్న వైద్యులు, స్టాఫ్ నర్స్ ఇతర పోస్టులను భర్తీ చేయాలని పటేల్ అన్నారు. ప్రజలకు అత్యవసరంగా సేవలందించేందుకు కుబీర్, బాసర మండలాల్లో అంబులెన్స్ ఇవ్వడంతో పాటు, బైంసాకు మరొకటి అదనంగా అంబులెన్స్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
వర్షాకాలం ప్రారంభమైన తరుణంలో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలతో సమీక్ష నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది.











