గర్భిణులు, బాలింతలు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని తీసుకోవడం అత్యవసరమని అష్టా గ్రామ సర్పంచ్ రావుల లావణ్య - శ్రీనివాస్ అన్నారు. ఈ మేరకు గురువారం అష్టా గ్రామంలోని అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించి, వారికి అవసరమైన పాలు, గుడ్లు, పప్పు దినుసులను అందజేశారు.
మండలంలోని అష్టా గ్రామంలో గల ఒకటవ అంగన్వాడి కేంద్రాన్ని సర్పంచ్ రావుల లావణ్య - శ్రీనివాస్ తనిఖీ చేశారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని, గర్భిణులకు, బాలింతలకు నెల రోజులకు సరిపడా పాలు, గుడ్లు, పప్పు దినుసులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, గర్భిణులు సరైన పోషకాహారం తీసుకుంటే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా పెరుగుతారని తెలిపారు. పప్పు దినుసులు, ఆకు కూరగాయల వంటివి అధికంగా తీసుకోవాలని సూచించారు.
గర్భిణీలు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, పోషకాహారాన్ని క్రమం తప్పకుండా తీసుకోవాలని ఆమె సూచించారు. ఆరోగ్యకరమైన జీవనశైలి బిడ్డ ఎదుగుదలకు దోహదపడుతుందని ఆమె పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్లు దమయంతి, సంగీత, ఆయా సుజాతతో పాటు స్థానిక అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.












