బోథ్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 27
బోథ్ నియోజకవర్గంలో గిరిజన, పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహను కోరారు. నియోజకవర్గంలోని వైద్య రంగ సమస్యలపై మంత్రికి వివరించారు.
బోథ్ నియోజకవర్గంలోని గిరిజన, పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కోరారు. ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ నిర్వహించిన సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే, నియోజకవర్గంలోని వైద్య రంగ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
బోథ్‌లో నూతనంగా నిర్మించిన 100 పడకల ఏరియా ఆసుపత్రి భవనం సిద్ధంగా ఉన్నప్పటికీ, స్పెషలిస్ట్ వైద్యులు, స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్ల పోస్టులు, అవసరమైన వైద్య పరికరాలు లేక సేవలు పూర్తిస్థాయిలో ప్రారంభం కాలేదని తెలిపారు. వెంటనే అవసరమైన క్యాడర్ పోస్టులను మంజూరు చేసి, టీఎస్ఎంఎస్ఐడీసీ ద్వారా పరికరాలను సమకూర్చాలని కోరారు.
ఇచ్చోడ పీహెచ్‌సీని 30 పడకల సీహెచ్‌సీగా అప్‌గ్రేడ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న ఇచ్చోడ మండలంలో సుమారు 45 వేల జనాభాకు ఒకే పీహెచ్సీ ఉందని, ఇన్‌పేషెంట్ సౌకర్యం లేక ప్రజలు దాదాపు 80 కిలోమీటర్ల దూరంలోని ఆదిలాబాద్‌కు వెళ్లాల్సి వస్తోందని వివరించారు. 30 పడకల సీహెచ్‌సీగా అప్‌గ్రేడ్ చేసి అదనపు సిబ్బందిని మంజూరు చేయాలని కోరారు.
నేరడిగొండ పీహెచ్‌సీకి రూ.6 కోట్ల అంచనా వ్యయంతో 30 పడకల ఇన్‌పేషెంట్ భవనం మంజూరు చేయాలని ఎమ్మెల్యే కోరారు. మండలంలో 80 శాతం మంది గిరిజన, బీపీఎల్ కుటుంబాలకు చెందినవారని, ప్రసూతులు, అత్యవసర కేసులకు ప్రస్తుతం సుమారు 40 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోందని తెలిపారు. లేబర్ రూమ్, ఎస్ఎన్సీయూ సౌకర్యాలతో భవనం మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
బోథ్ ఏరియా ఆసుపత్రిలో 4 పడకల డయాలసిస్ యూనిట్‌ను ప్రారంభించడంతో పాటు ఇచ్చోడలో మరో 4 పడకల డయాలసిస్ కేంద్రాన్ని మంజూరు చేయాలని కోరారు. బోథ్, ఇచ్చోడ ప్రాంతాలకు చెందిన 50 మందికి పైగా కిడ్నీ రోగులు వారానికి రెండు, మూడు సార్లు సుమారు 100 కిలోమీటర్లు ప్రయాణించి రిమ్స్ ఆదిలాబాద్‌కు వెళ్లాల్సి వస్తోందని తెలిపారు. ప్రయాణ భారం కారణంగా పేద రోగులు చికిత్సను మధ్యలోనే నిలిపివేస్తున్నారని వివరించారు.
బోథ్ నియోజకవర్గం మీదుగా ఎన్‌హెచ్-44 వెళ్లే నేపథ్యంలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, గోల్డెన్ అవర్‌లో చికిత్స అందక పలువురు ప్రాణాలు కోల్పోతున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. బోథ్ 100 పడకల ఏరియా ఆసుపత్రిలో 10 పడకల ట్రామా కేర్ సెంటర్, ఐసీయూ, ఆపరేషన్ థియేటర్ ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే వాంకిడి, బోథ్ ఎక్స్ రోడ్డు, సీతాగొంది, మన్నూర్, సోనాల తదితర బ్లాక్ స్పాట్లను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక 108 అంబులెన్స్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
బోథ్ నియోజకవర్గ ప్రజల, ముఖ్యంగా గిరిజనుల ఆరోగ్యం, ప్రాణాలతో ముడిపడిన అంశాలైనందున వీటిని ప్రాధాన్యతతో పరిగణించి తక్షణమే ఆమోద ఉత్తర్వులు జారీ చేయాలని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆరోగ్యశాఖ మంత్రిని కోరారు.











