మనోరంజని తెలుగు టైమ్స్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 15
ప్రకృతి మనిషికి అందించిన అత్యంత విలువైన వనరుల్లో నీరు మొదటిది. అలాంటి నీటి వనరులే నేడు క్రమంగా క్షీణిస్తున్నాయి. ఈ ఏడాది ఎల్నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలో జలాశయాలతో పాటు భూగర్భ జలాలు భారీగా పడిపోయాయి. ఇటీవల భూగర్భ జలవనరుల శాఖ విడుదల చేసిన నివేదికలో భూగర్భ జలమట్టం గణనీయంగా పడిపోయిందని చూపిన లెక్కలు భయపెడుతున్నాయి.
మనిషికి ప్రకృతి ప్రసాదించిన అమూల్యమైన వనరుల్లో నీరు ఒకటి. అలాంటి నీటి వనరులే నేడు క్రమంగా క్షీణిస్తున్నాయి. ఈ ఏడాది ఎల్నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలో జలాశయాలతో పాటు భూగర్భ జలాలు భారీగా పడిపోయాయి. ఇటీవల భూగర్భ జలవనరుల శాఖ విడుదల చేసిన నివేదికలో భూగర్భ జలమట్టం గణనీయంగా పడిపోయిందని చూపిన లెక్కలు భయపెడుతున్నాయి.
వ్యవసాయంతో పాటు తాగునీటి అవసరాలకు కూడా భరోసాగా నిలిచిన జలాలు నేడు ప్రమాదకర స్థాయికి చేరుకోవడం రాబోయే నీటి సంక్షోభానికి స్పష్టమైన సంకేతం. భూగర్భజలాలు తగ్గిపోవడం అంటే పట్టణాలతో పాటు గ్రామాలకూ ప్రమాదమే. జులై రెండోవారం దాటినా వానల జాడలేదు. ఎగువ ప్రాంతాల్లోనూ వర్షాలు ఆశించినంతగా లేవు. ఆకాశం వైపు కళ్లు కాయలు కాచేలా జనం ఎదురుచూస్తున్నారు. అడపాదడపా చినుకులు తప్ప పెద్ద వర్షాలు లేవు.
రాష్ట్రంలో ఇరవై జిల్లాలు తీవ్ర వర్షపాత లోటును ఎదుర్కొంటున్నాయి. మేడ్చల్ - మల్కాజిగిరిలో అత్యధికంగా 48 శాతం, హైదరా బాద్లో 25 శాతం లోటు ఉంది. 17 జిల్లాల్లో భూగర్భ జలమట్టాలు గతేడాదితో పోలిస్తే భారీగా పడిపోయాయి. రాజధానిలో 9.96 మీటర్ల నుంచి 12.48 మీటర్లకు పడిపోయింది. నాగార్జునసాగర్, శ్రీరాం సాగర్, జురాల వంటి ఎనిమిది ప్రధాన రిజర్వాయర్లలో 12.92 శాతం నీరు మాత్రమే నిల్వ ఉంది. ఇది దేశంలోని అత్యంత అట్టడుగు స్థాయి. ఇదే పరిస్థితి మరి కొద్దిరోజులుంటే వేసిన పంటలపైనా ఆశలు వదులుకోవాల్సిందే. తాగునీటికీ ఇబ్బందులు తప్పవు.
తెలంగాణలో తాగునీటి సరఫరా, వ్యవసాయం, పరిశ్రమలు, గ్రామీణ జీవన విధానం భూగర్భ జలాలపైనే ఎక్కువ ఆధారపడి ఉన్నాయి. వరుసగా వర్షాలు తగ్గడం, పట్టణ ప్రాంతాల్లో భూగర్భ జలాల రీఛార్జ్ లేకపోవడం, చెరువులు ఆక్రమణలకు గురికావడం వల్ల భూగర్భ జలాలు ప్రతి ఏడాది మరింత లోతుకు వెళ్లుతున్నాయని నిపుణుల అభిప్రాయం. ఒకప్పుడు 100 నుంచి 200 అడుగుల్లో లభించిన నీరు ఇప్పుడు 800 నుంచి వెయ్యి అడుగుల లోతులోనూ దొరకని పరిస్థితి. జలాశయాల్లో నిల్వలు తగ్గిపోతే మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు బోర్లపై ఆధారపడాల్సి వస్తుంది. అవి కూడా ఎండిపోతే ట్యాంకర్లే దిక్కు.
ఇలాంటి పరిస్థితులకు ప్రకృతి వైపరీత్యాలే ఒక్కటే కారణం కాదు, కేంద్రంలోని మోడీ సర్కార్ అనుసరించిన విధానాలూ నష్టాన్ని తెచ్చాయి. ప్రకృతిని చెరబట్టేలా అదానీ, అంబానీ వంటి కార్పొరేట్ అధిపతులకు అనుకూల నిర్ణయాలు తీసుకోవడం వల్లే ప్రస్తుత పర్యావరణం సంక్షోభంలోకి చిక్కుకుంది. అడవులను, కొండలను, జలశయాలను పూర్తిగా ధ్వంసం చేయడం వల్లే ఈ పరిస్థితి దాపురిచింది.
రాబోవు కాలంలోనూ వర్షాలు ఆశించినంతగా ఉండబోవనేది భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా. జూన్లో మొదలైన ఈ పరిస్థితులు జులై, సెప్టెంబర్ మధ్య తీవ్రరూపం దాల్చి శీతాకాలం వరకు కొనసాగుతుందని ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరిక. గోదావరితో పాటు కృష్ణా బేసిన్లోనూ ఇలానే ఉంటుందని నిపుణుల వాదన.












