Hyderabad/Shaikpet (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 29
కొత్తూరు మండలం సిద్ధాపూర్ గ్రామంలో ప్రతిపాదిత ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రం ఏర్పాటు వల్ల దళితులు, రైతుల జీవితాలు అస్తవ్యస్తం అవుతున్నాయని బీజేపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై ఢిల్లీలో జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామ్చందర్ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
కొత్తూరు మండలం సిద్ధాపూర్ గ్రామంలో ప్రతిపాదిత ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రం ఏర్పాటు వల్ల ప్రభావితమయ్యే ఎస్సీ కుటుంబాలు, అసైన్డ్ భూములు కోల్పోయిన రైతులు, చిన్న, సన్నకారు రైతుల హక్కులు, ఆరోగ్యం, తాగునీరు, జీవనోపాధిని రక్షించాలని కోరుతూ బీజేపీ నాయకులు నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి, అందె బాబయ్య ఢిల్లీలో జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు శ్రీ వడ్డేపల్లి రామ్చందర్ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా సిద్ధాపూర్, పరిసర గ్రామాల్లోని పలువురు ఎస్సీ కుటుంబాలకు గతంలో ప్రభుత్వం అసైన్డ్ భూములు కేటాయించిన విషయాన్ని కమిషన్ సభ్యుల దృష్టికి తీసుకెళ్లినట్లు నాయకులు తెలిపారు. అనంతరం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, ఇతర పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి భూములను స్వాధీనం చేసుకున్నప్పటికీ, ప్రస్తుతం అదే ప్రాంతంలో ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రం ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు రావడం పట్ల ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొన్నదని వివరించారు.
మిగిలిన ఎస్సీ చిన్న, సన్నకారు రైతులు వ్యవసాయం, పశుపోషణ, కూలి పనులపై ఆధారపడి జీవిస్తున్నారని, ప్రతిపాదిత ప్రాజెక్టు కారణంగా భూగర్భ జలాలు, నేల, గాలి కలుషితమయ్యే ప్రమాదం ఉందని వారు కమిషన్కు వివరించినట్లు తెలిపారు. దీనివల్ల ప్రజల ఆరోగ్యంతో పాటు వ్యవసాయం, పశుపోషణ, జీవనోపాధిపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.
స్థానిక ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా, పూర్తి స్థాయి పర్యావరణ పరిశీలన, ప్రజా విచారణ నిర్వహించకుండా ప్రాజెక్టు ప్రక్రియను ముందుకు తీసుకెళ్తున్నారని కమిషన్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రతిపాదిత ప్రాజెక్టును తక్షణమే నిలిపివేసి, పర్యావరణపరంగా సురక్షితమైన ప్రత్యామ్నాయ ప్రాంతాన్ని పరిశీలించాలని జాతీయ ఎస్సీ కమిషన్ను కోరినట్లు వెల్లడించారు.
సిద్ధాపూర్ సమస్యను జాతీయ ఎస్సీ కమిషన్ గంభీరంగా పరిగణించి, ప్రభావిత ఎస్సీ కుటుంబాలు, రైతులకు న్యాయం జరిగేలా తగిన చర్యలు తీసుకుంటుందనే ఆశాభావాన్ని నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి, ఆందే బాబయ్య వ్యక్తం చేశారు.











