ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లాలో జూన్ 1 నుండి 12 రోజుల పాటు నిర్వహించిన ప్రత్యేక హరిత యజ్ఞం విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమం విద్యార్థులు, యువత మరియు ప్రజల్లో పర్యావరణ పరిరక్షణపై విస్తృత అవగాహన కల్పించింది.
12 రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో వన్యప్రాణుల సంరక్షణ, గ్లోబల్ వార్మింగ్ ప్రభావాలు, ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే నష్టాలు, ప్లాస్టిక్ నిషేధం వంటి అంశాలపై సదస్సులు, ర్యాలీలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.
విద్యార్థుల్లో పర్యావరణ స్పృహను పెంచేందుకు వ్యాసరచన, ఉపన్యాసం, చిత్రలేఖన పోటీలు నిర్వహించి, ప్రతిభ కనబరిచిన వారికి ప్రశంసా పత్రాలు, మెమెంటోలు అందజేశారు. 'ప్లాస్టిక్ వద్దు - పచ్చదనం ముద్దు' నినాదంతో ప్రజలను చైతన్యపరిచారు.
ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా అటవీ అధికారి సుశాంత్ సుఖదేవ్ భోబడే ఐఎఫ్ఎస్, పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో అటవీ శాఖ అధికారులు, సిబ్బంది, విద్యార్థులు, పాత్రికేయులు పాల్గొన్నారు. 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఇలాంటి అవగాహన కార్యక్రమాలు భవిష్యత్తులోనూ కొనసాగుతాయని అటవీ అధికారులు తెలిపారు.











