Vizianagaram/Balijipeta (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 28
తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు కొత్త రంగుల యూనిఫామ్‌లను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అధికారులు, ప్రజాప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ యూనిఫామ్లతో పాటు బూట్లు, సాక్సులు, టై, బెల్టులను కూడా ఉచితంగా అందజేయనున్నారు.
తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అందజేసే యూనిఫామ్స్‌పై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అధికారులు, ప్రజాప్రతినిధులతో జరిపిన సమావేశం అనంతరం విద్యార్థులకు కొత్త రంగుల్లో యూనిఫామ్‌లను ఖరారు చేసింది.
రంగుల ఎంపిక: బాలుర, బాలికల షర్టులను లైట్ బ్లూ (లేత నీలం) రంగులో, అలాగే బాలుర ప్యాంట్లు మరియు బాలికల బాటమ్స్‌ను డార్క్ బ్లూ (ముదురు నీలం) రంగులో నిర్ణయించారు. గురుకుల పాఠశాల పిల్లలకు మెరూన్ చెక్స్ ఉన్న టాప్స్, ప్లెయిన్ మెరూన్ బాటమ్లను ఖరారు చేశారు.
6వ తరగతి నుంచే ప్యాంట్లు: ఈసారి ప్రాథమిక స్థాయి మార్పుగా 6వ తరగతి నుంచే బాలురకు నిక్కర్లకు బదులుగా ప్యాంట్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దాదాపు 27 లక్షల మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి రెండు జతల చొప్పున ఈ కొత్త యూనిఫామ్‌లను అందించనున్నారు. అందులో మొదటి జత దుస్తులను ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
యూనిఫామ్లతో పాటు విద్యార్థులందరికీ బూట్లు, సాక్సులు, టై, బెల్టులను కూడా సర్కారే ఉచితంగా అందజేయనుంది. ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు సర్కారీ కార్పొరేట్ లుక్ తీసుకురావాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.











