పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు రాయనున్న విద్యార్థులకు ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని అష్టా గ్రామ సర్పంచ్ రావుల లావణ్య శ్రీనివాస్ సూచించారు. శనివారం అష్టా గ్రామంలోని పరీక్షా కేంద్రాన్ని సందర్శించి, విద్యార్థులకు ధైర్యం చెప్పారు.
మండలంలోని అష్టా గ్రామంలో ఏర్పాటు చేసిన పదవ తరగతి పబ్లిక్ పరీక్షా కేంద్రానికి విచ్చేసిన విద్యార్థులకు సర్పంచ్ రావుల లావణ్య శ్రీనివాస్ హార్దిక స్వాగతం పలికారు. పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులతో నేరుగా సంభాషించి, వారికి భరోసా కల్పించారు. పరీక్షా కేంద్రం వద్ద విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, విద్యార్థులు ఎలాంటి భయం, ఆందోళన లేకుండా పరీక్షలు రాయాలని, కష్టపడి చదివిన వాటిని నమ్మకంతో రాస్తే మంచి ఫలితాలు వస్తాయని తెలిపారు. పదవ తరగతి పరీక్షలు విద్యార్థి జీవితంలో ఒక కీలకమైన ఘట్టమని, ఇందులో ఉత్తమ ప్రతిభ కనబరిచి తల్లిదండ్రులకు, గ్రామానికి గర్వకారణం కావాలని ఆకాంక్షించారు.
పరీక్షల సమయంలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడంతో పాటు, సమయపాలన పాటిస్తూ ప్రశాంతంగా పరీక్షలు రాయాలని సూచించారు. విద్యార్థుల విజయానికి ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్, సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్, మండల విద్యాశాఖ అధికారి, ఇన్విజిలేటర్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.











