ప్రపంచ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధాల కారణంగా అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలపై ఆందోళన వ్యక్తం చేస్తూ కుంటాల మండల కేంద్రంలోని శాంతినికేతన్ విద్యానిలయం విద్యార్థులు మానవహారం నిర్వహించారు. శనివారం పాఠశాల ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొని ప్రపంచంలో శాంతి నెలకొనాలని, యుద్ధాలు తక్షణమే ఆగాలని కోరుతూ శాంతి సందేశాన్ని ఇచ్చారు.
విద్యార్థులు “యుద్ధాలు మానవాళికి ప్రమాదకరం”, “ప్రపంచంలో శాంతి నెలకొనాలి” వంటి నినాదాలు చేశారు.
పాఠశాల ప్రిన్సిపల్ సంతోష్ మాట్లాడుతూ ప్రపంచ దేశాలు యుద్ధాలను విరమించి శాంతి, స్నేహం మరియు సహకారం మార్గాన్ని అనుసరించాలని సూచించారు. యుద్ధాల వల్ల నిరపరాధ ప్రజలు, చిన్న పిల్లలు ప్రాణాలు కోల్పోవడం ఎంతో బాధాకరమని తెలిపారు.
పాఠశాల డైరెక్టర్ ప్రవీణ్ మాట్లాడుతూ సమస్యలను యుద్ధాల ద్వారా కాకుండా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


