మనోరంజని తెలుగు టైమ్స్, మెండోరా ప్రతినిధి: ముప్కాల్ మండల కేంద్రంలో 2026–27 విద్యా సంవత్సరానికి గాను “ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట” కార్యక్రమాన్ని సర్పంచ్ కొమ్ముల సాయమ్మ శ్రీనివాస్, ఎం.ఇ.ఓ ఎం. గంగారం ఆధ్వర్యంలో ప్రారంభించారు.
ప్రభుత్వ ప్రగతి ప్రణాళికలో భాగంగా చేపట్టిన ఈ కార్యక్రమం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తల్లిదండ్రుల సమావేశంతో మొదలైంది. విద్యార్థుల విద్యాభివృద్ధికి తల్లిదండ్రుల సహకారం ఎంతో అవసరమని ఈ సందర్భంగా నొక్కి చెప్పారు.
సమావేశంలో విద్యార్థులకు బహుమతులు అందజేశారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని, పాఠశాలల్లో క్రమం తప్పకుండా హాజరు కావాలని సూచించారు.
ఈ బడిబాట కార్యక్రమం ద్వారా విద్యార్థులలో చదువు పట్ల ఆసక్తిని పెంచడం, పాఠశాల విద్యను కొనసాగించేలా ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. డ్రాపౌట్లను తగ్గించి అందరికీ విద్యను అందించే దిశగా చర్యలు చేపట్టారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల అధికారి నరసయ్య, గ్రామపంచాయతీ ఉపసర్పంచ్ దినేష్ శ్రీధర్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, గ్రామస్తులు పాల్గొన్నారు.












