రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర కల్పించే లక్ష్యంతో కుంటాల మండలంలోని లింబా (కె) గ్రామపంచాయతీలో ఐకేపీ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గ్రామ సర్పంచ్ గీత మహేందర్ బుధవారం ప్రారంభించారు.
మధ్యవర్తుల దోపిడీకి అడ్డుకట్ట వేసేందుకు ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలో, రైతులు నాణ్యమైన ధాన్యాన్ని తీసుకువచ్చి ప్రభుత్వ మద్దతు ధరను సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ గీత మహేందర్ సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా కొనుగోలు ప్రక్రియను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆమె తెలిపారు.
ధాన్యం తూకం, రవాణా, చెల్లింపుల విషయంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆమె అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం రైతులు పండించిన ప్రతి గింజకు సరైన ధర అందేలా చర్యలు తీసుకుంటుందని, రైతులు దళారులను నమ్మకుండా నేరుగా కొనుగోలు కేంద్రాలకు రావాలని కోరారు.
ఈ కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఐకేపీ కమిటీ సభ్యులు జి. చంద్రబాయి, లక్ష్మి, మాజీ సర్పంచ్ ఆనంద్ రావు పటేల్, ఉపసర్పంచ్ సత్యనారాయణ, ఏపీఎం లక్ష్మణ్, ఏఈఓ శ్రీనివాస్, వీడీసీ చైర్మన్ సాయినాథ్, రైతులు ఆనంద్, వెంకట్ రెడ్డి, లక్ష్మణ్, ఎర్రోళ్ల శ్రీనివాస్, వీఓఏ గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.












