మొక్కజొన్న, వరి ధాన్యం తరలింపు ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా సంబంధిత అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో నిల్వలు లేకుండా చర్యలు తీసుకోవాలని, అవసరమైతే స్థానిక కూలీలను నియమించుకోవాలని సూచించారు.
బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎస్పీ జానకి షర్మిలతో కలిసి ధాన్యం తరలింపుపై సమీక్ష నిర్వహించిన కలెక్టర్, టోల్ ప్లాజాలు, చెక్‌పోస్టుల వద్ద ఖాళీ లారీలను వినియోగించుకోవాలని, అవసరమైతే మరిన్ని లారీలను సమకూర్చుకోవాలని సూచించారు. రెవెన్యూ, పోలీస్, వ్యవసాయ శాఖల సిబ్బందిని షిఫ్ట్‌ల వారీగా నియమించాలని ఆదేశించారు.
కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సంచులు నిల్వ ఉండకూడదని స్పష్టం చేసిన కలెక్టర్, 25-30 కిలోమీటర్ల పరిధిలో ఉన్న కేంద్రాల నుంచి ట్రాక్టర్ల ద్వారా రవాణా చేపట్టాలని సూచించారు. ప్రభుత్వ, ప్రైవేట్ గోదాములతో పాటు రైతు వేదికల్లోనూ ధాన్యం నిల్వకు చర్యలు తీసుకోవాలని చెప్పారు.
రైతుల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, ధాన్యం తరలింపునకు పోలీస్ శాఖ పూర్తి సహకారం అందిస్తుందని, చెక్‌పోస్టులు, తనిఖీ కేంద్రాల్లో పోలీసు సిబ్బందిని నియమిస్తామని తెలిపారు. అక్రమ వసూళ్లకు పాల్పడితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.











