నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలు, ప్రశ్నపత్రం లీకేజీ అంశంపై దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ధర్నాలు, ఆందోళనలు, నిరసన కార్యక్రమాల ఫలితంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం విద్యార్థుల విజయమని నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పోతన్న యాదవ్ అన్నారు.
ముధోల్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడిన కేంద్ర ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలని కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచే డిమాండ్ చేస్తోందని గుర్తు చేశారు.
దేశవ్యాప్తంగా విద్యార్థులకు న్యాయం చేయాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాటం చేయడంతో కేంద్ర ప్రభుత్వం ఒత్తిడికి లోనై విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాల్సి వచ్చిందన్నారు. ఈ పరిణామం కాంగ్రెస్ పార్టీ సాధించిన రాజకీయ విజయం కంటే, విద్యార్థుల న్యాయం కోసం సాగిన పోరాటానికి లభించిన విజయంగా భావించాలని ఆయన పేర్కొన్నారు.
విద్యా వ్యవస్థలో పారదర్శకత, విశ్వసనీయతను పునరుద్ధరించేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ఎంపీపీ అఫ్రోజ్ ఖాన్, బషీర్, ఇజాజ్ ఉద్దీన్, మండల అధ్యక్షులు కిష్టయ్య, కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.












