తెలంగాణలో ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలైన ఈఏపీసెట్ -2026 పరీక్షలు రాష్ట్రవ్యాప్తంగా మే 9 నుంచి ప్రారంభం కానున్నాయి. జేఎన్టీయూ హైదరాబాద్ ఈ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. పరీక్షలు మే 11వ తేదీ వరకు కొనసాగుతాయి.
జేఎన్టీయూ హైదరాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించబడే ఈఏపీసెట్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ పరీక్షలు రాష్ట్రవ్యాప్తంగా 125 కేంద్రాలలో జరగనున్నాయి. పరీక్షలు రోజుకు రెండు సెషన్లలో, అనగా ఉదయం 9 నుండి 12 గంటల వరకు మరియు మధ్యాహ్నం 3 నుండి 6 గంటల వరకు నిర్వహించబడతాయి. అభ్యర్థులు నిర్ణీత సమయానికి కచ్చితంగా పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని, ఆలస్యమైతే ప్రవేశం లేదని అధికారులు స్పష్టం చేశారు.
ఈఏపీసెట్ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,01,194 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఇంజనీరింగ్ స్ట్రీమ్‌కు 2,10,308 మంది, అగ్రికల్చర్ మరియు ఫార్మసీ స్ట్రీమ్‌లకు 90,569 మంది దరఖాస్తులు సమర్పించారు. అభ్యర్థులందరికీ ఇప్పటికే హాల్ టికెట్లు జారీ చేయబడ్డాయి.
పరీక్షల కన్వీనర్ డా. కె. విజయకుమార్ రెడ్డి మాట్లాడుతూ, ఇంజనీరింగ్ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, సజావుగా జరిగేలా పటిష్టమైన చర్యలు తీసుకున్నామని తెలిపారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.












