బాసర ఐఐఐటిలో విద్యార్థులకు నైపుణ్యాలతో కూడిన నాణ్యమైన విద్యను అందించాలని, ఆధునిక బోధనా పద్ధతులను అనుసరించాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా సూచించారు.
మంగళవారం ఐఐఐటి క్యాంపస్‌ను సందర్శించిన కలెక్టర్, యూనివర్సిటీ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థుల సంఖ్య, విద్యా విధానం, వసతి సౌకర్యాలు, విద్యార్థుల విజయాలపై అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు.
ప్రపంచంతో పోటీపడే స్థాయిలో విద్యార్థులను తీర్చిదిద్దాలని, భవిష్యత్తులో ఉపాధి అవకాశాలున్న రంగాల్లో వారిని ప్రోత్సహించాలని కలెక్టర్ సూచించారు. విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో అన్ని సౌకర్యాలు కల్పించాలని, నాణ్యమైన ఆహారం, సురక్షితమైన తాగునీరు అందించాలని ఆదేశించారు.
యూనివర్సిటీ అభివృద్ధికి, మౌలిక వసతుల కల్పనకు అవసరమైన సహకారం అందిస్తామని కలెక్టర్ భరోసా ఇచ్చారు. అనంతరం యూనివర్సిటీ అధికారులు కలెక్టర్, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్ లను సన్మానించారు.
ఈ సమావేశంలో వర్సిటీ ఉపకులపతి గోవర్ధన్, డిఆర్డిఓ విజయలక్ష్మి, తహసీల్దార్ పవన్ చంద్ర, పలువురు అధికారులు, అధ్యాపకులు పాల్గొన్నారు.












