బోధన్, జులై 2
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి పరిష్కరించాలని బీడీఎస్ఎఫ్ విద్యార్థి సంఘం విద్యాశాఖ అధికారులను కోరింది. బోధన్ మండల విద్యాశాఖ అధికారి కార్యాలయం వద్ద నిరసన చేపట్టి, వినతిపత్రం అందజేశారు.
ప్రభుత్వ పాఠశాలలను విద్యాశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో తరచూ సందర్శించి, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని బీడీఎస్ఎఫ్ విద్యార్థి సంఘం డిమాండ్ చేసింది. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గురువారం బోధన్ పట్టణంలోని మండల విద్యాశాఖ అధికారి కార్యాలయం ఎదుట సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టి, అనంతరం అధికారికి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు సంజయ్ తల్లారే మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు సమస్యలకు నిలయాలుగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. అనేక పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. మరుగుదొడ్లు, మూత్రశాలలు, స్వచ్ఛమైన తాగునీరు, వర్షాకాలంలో అవసరమైన ప్రాథమిక మందులు ప్రతి పాఠశాలలో అందుబాటులో ఉంచాలని కోరారు.
బోధన్ పట్టణంలోని మధుమలాంచ ప్రభుత్వ పాఠశాల రాత్రి వేళల్లో అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రంగా మారుతోందని ఆరోపించారు. పాఠశాలకు ప్రహరీ గోడ నిర్మించి, రాత్రి వేళల్లో భద్రత కల్పించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ పాఠశాలలను మూసివేసే నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని, ప్రైవేటు విద్యాసంస్థల్లో పేద విద్యార్థులకు కేటాయించాల్సిన సీట్లను విద్యాహక్కు చట్టం ప్రకారం తప్పనిసరిగా అమలు చేయాలని కోరారు. ఖాళీగా ఉన్న మండల విద్యాశాఖ అధికారి, ఉపాధ్యాయ, బోధనేతర సిబ్బంది పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, విద్యార్థులకు అందించాల్సిన పాఠ్యపుస్తకాలు, దుస్తులు, ఇతర విద్యా సామగ్రిని ఆలస్యం లేకుండా పంపిణీ చేయాలని విజ్ఞప్తి చేశారు.
అలాగే రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఉదయపు అల్పాహార పథకాన్ని అమలు చేయాలని, విద్యాశాఖ అధికారులు కార్యాలయాలకే పరిమితం కాకుండా పాఠశాలలను ప్రత్యక్షంగా సందర్శించి సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బోధన్ పట్టణ అధ్యక్షుడు కిరణ్, కార్యదర్శి నరేందర్, జిల్లా నాయకులు రాజు, దీపక్, లాలూ, జీవన్ తదితరులు పాల్గొన్నారు.












