భైంసా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో అమరవీరుల దినోత్సవాన్ని (షహీద్ దివస్) ఘనంగా నిర్వహించారు. స్వాతంత్ర్య పోరాటంలో ప్రాణాలర్పించిన వీరులకు అధ్యాపకులు, విద్యార్థులు ఘనంగా నివాళులర్పించారు.
1931 మార్చి 23న భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్ దేవ్ లను బ్రిటిష్ ప్రభుత్వం ఉరి తీసిన దినాన్ని స్మరించుకుంటూ, వారి త్యాగాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
కళాశాల ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ డా. కె. రఘునాథ్ మాట్లాడుతూ, అమరవీరుల స్ఫూర్తితో విద్యార్థులు దేశభక్తిని పెంపొందించుకోవాలని సూచించారు. దేశ అభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషించాలని ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ ఎ. రాజు, డా. ఓంప్రకాశ్ అన్నారు.
డాక్టర్ పవన్ కుమార్, డాక్టర్ రవికుమార్ అమరవీరుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని, విద్యార్థులు దేశభక్తి, క్రమశిక్షణతో సమాజానికి ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ జై భీమారావు, డాక్టర్ శంకర్, డాక్టర్ సంతోష్ కుమార్, సురేందర్, శ్రావణ్య, దివ్య, డాక్టర్ కల్పన, రాజయ్య, కిషన్, రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.












