*గుప్త నిధుల కోసం తవ్వకాలు..పోలీసుల రంగప్రవేశం… అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపిన వైనం…*
మనోరంజని తెలుగు టైమ్స్
వరంగల్ జిల్లా ముల్కనూరు ప్రతినిధి అక్టోబర్ 26
కష్టం లేకుండా కరెన్సీకట్టలు కూడబెట్టాలనుకునే స్వార్ధపరులు పెరిగిపోయారు. గుప్తనిధుల వేట ముమ్మరం చేశారు.. ప్రత్యేక పరికరాలు తయారుచేసుకొని అదేపనిగా గుప్తనిధుల కోసం తవ్వకాలు జరుపుతున్నారు.. తాంత్రిక పూజలు నిర్వహించి ప్రత్యేక డిటెక్టర్స్ సహాయంతో తవ్వకాలు నిర్వహిస్తున్న ఆ ముఠా.. జనం హడలెత్తిపోయేలా చేస్తున్నారు.. ఈ క్రమంలోనే ఓ చోట గుప్తనిధుల కోసం తవ్వకాలు జరుపుతున్న ముఠా వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు అడ్డంగా దొరికింది.. వారిని అరెస్టు చేసిన పోలీసులు ఆ ముఠా నుంచి గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపే పరికరాలను స్వాధీనం చేసుకున్నారు
ముల్కనూరు గ్రామ శివారులోని ఖాళీ స్థలంలో గుప్త నిధుల తవ్వకాలకు స్కెచ్ వేశారు.. ఏడుగురు వ్యక్తులు ఇక్కడ భారీగా ఎత్తున గుప్త నిధులు ఉన్నాయని డిటెక్టర్ ద్వారా గుర్తించారు.. ఆ నిధుల తవ్వకాల కోసం ప్రత్యేకంగా ఇద్దరు పూజారులను తీసుకువచ్చి తాంత్రిక పూజలు నిర్వహించారు.. కూష్మాండ బలిచ్చి క్షుద్రపూజల కోసం రాత్రివేళ దర్జాగా తవ్వకాలు చేపట్టారు. ఈ క్రమంలో గుప్తనిధుల కోసం తవ్వకాలు జరుపుతున్న విషయం టాస్క్ ఫోర్స్ పోలీసుల చెవిన పడింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఈ ముఠాను పట్టుకున్నారు..
మొత్తం ఏడుగురు సభ్యుల ముఠాను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు.. తవ్వకాల కోసం వినియోగించిన పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.. గుప్త నిధులను గుర్తించే ప్రత్యేక డిటెక్టర్ తో పాటు, ఓ కారు, ఒక ట్యాబ్, 7 మొబైల్స్ ను స్వాధీనం చేసుకున్నారు.
ఇదొక్కటే కాదు.. గతంలో కూడా చాలా ప్రాంతాల్లో ఈ ముఠా గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపినట్లుగా పోలీసుల విచారణలో తేలింది.. గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపిన అనంతరం గుప్త నిధుల బూచి చూపి కొంతమంది అమాయకులకు ఎరవేసి భారీ మొత్తంలో డబ్బులు గుంజుతారని పోలీస్ అధికారులు గుర్తించారు.. వీరిని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు..