విజయవాడ గ్రామీణం, 2024-07-31
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ ఆలయంలో ఓ యువతి ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేయడం తీవ్ర వివాదాస్పదమైంది. ఆలయ ప్రాంగణంలోని రాజగోపురం వద్ద నృత్యం చేస్తూ వీడియోలు తీసిన యువతిపై దేవస్థానం అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ ఆలయంలో ఓ యువతి ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేయడం తీవ్ర వివాదాస్పదమైంది. ఆలయ ప్రాంగణంలోని మహా మండపం ఏడో అంతస్థు రాజగోపురం వద్ద సదరు యువతి నృత్యం చేస్తూ వీడియోలు తీసి, వాటిని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆలయ అధికారులు ఈ విషయంపై తీవ్రంగా స్పందించారు. దీనిపై విజయవాడ వన్ టౌన్ పోలీసులకు దేవస్థానం అధికారులు ఫిర్యాదు చేశారు.
భద్రతా వైఫల్యంపై ప్రశ్నలు
రాజగోపురానికి ఎదురుగా నిలబడి యువతి నాట్యం చేస్తూ వీడియోలు తీస్తుంటే, ఆలయ అధికారులు, సిబ్బంది ఏం చేస్తున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. భద్రతాపరమైన అంశాల్లో బెజవాడ దుర్గమ్మ ఆలయం ఏ స్థితిలో ఉందో ఈ సంఘటన తెలియజేస్తుందని పలువురు సోషల్ మీడియా వేదికగా విమర్శిస్తున్నారు. గతంలో కూడా ఆలయం లోపలికి సెల్ఫోన్లు తీసుకెళ్లి, అమ్మవారిని ఫోటోలు తీసి నెట్టింట పోస్టు చేసిన సంఘటనలు చోటుచేసుకున్నాయి.
నిబంధనలు గాలికి
ఆలయ ప్రాంగణంలోకి సెల్ఫోన్ల వాడకానికి అనుమతి నిరాకరించబడింది. భక్తుల దర్శనానికి వచ్చే మార్గంలోనే కొండ దిగువన కనకదుర్గా నగర్, ఘాట్‌రోడ్డు వైపు వచ్చే వారికి ఓం టర్నింగ్ వద్ద సెల్‌ఫోన్ కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఎవరైనా ఆలయంలోకి వెళ్లేటప్పుడు అక్కడే మొబైల్ ఫోన్లు ఇచ్చేసి దర్శనానికి వెళ్లాలని సూచిస్తున్నారు. అయినప్పటికీ, వందలాది మంది భక్తులు సెల్ఫోన్లతోనే ఆలయంలోకి ప్రవేశిస్తున్నారని తెలుస్తోంది. ఆలయంలో సెల్ఫోన్లు తీసుకురాకూడదని, ఫొటోలు తీయకూడదని హెచ్చరిక బోర్డులు దర్శనమిస్తున్నా, ఆచరణలో ఈ నిబంధనలు ఎక్కడా అమలు కావడం లేదని భక్తులు అభిప్రాయపడుతున్నారు.
పోలీసులకు ఫిర్యాదు
యువతి నృత్యం చేసిన ఘటనపై దేవస్థానం ఈఓ వి.కె.శీనా నాయక్ ఆదేశాల మేరకు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ అధికారి వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. జూలై 30వ తేదీ మధ్యాహ్నం 1:45 గంటల నుంచి 1:47 గంటల మధ్య ఈ వీడియో తీసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. సుమారు రెండు నిమిషాల పాటు ఆమె వీడియో రికార్డు చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసినట్లు తెలిపారు. ఆలయ పవిత్రతకు భంగం కలిగించేలా వ్యవహరించినట్లు అధికారులు ఫిర్యాదులో పేర్కొన్నారు.












