నిర్మల్ జిల్లా, సారంగాపూర్ మండలంలోని ప్రసిద్ధ అడెల్లి శ్రీ మహా పోచమ్మ ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. వివిధ జిల్లాల నుండి వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
ఆదివారం ఉదయం నుండే భక్తులు కోనేటిలో పుణ్యస్నానాలు ఆచరించి, అమ్మవారి దర్శనం కోసం బారులు తీరారు. ఇది నిత్యం భక్తులతో సందడిగా ఉండే పుణ్యక్షేత్రం.
అదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలతో పాటు, పొరుగున ఉన్న మహారాష్ట్రలోని నాందేడ్, నాక్ పూర్, పర్బాని జిల్లాల నుండి కూడా భక్తులు ప్రత్యేక వాహనాల్లో తరలివచ్చారు. అమ్మవారిని దర్శించుకుని తమ మొక్కులను సమర్పించుకున్నారు.
ఆలయ పరిసరాల్లో భక్తులు వంటా వార్పు చేసుకుని, కుటుంబ సమేతంగా భోజనాలు చేశారు. ఆలయానికి వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ చైర్మన్ సింగం భోజగౌడ, ఈఓ భూమయ్యలు పర్యవేక్షించారు.
భక్తుల సౌకర్యార్థం అవసరమైన అన్ని ఏర్పాట్లను అధికారులు కల్పించారు. ప్రశాంత వాతావరణంలో అమ్మవారి దర్శనం చేసుకునేలా చర్యలు తీసుకున్నారు. సెలవుదినం కావడంతో రద్దీ అధికంగా ఉన్నట్లు తెలిపారు.












