సంకష్టహర చతుర్థి సందర్భంగా నిజామాబాద్ నగరంలోని పెద్ద రామాలయంలో విఘ్నేశ్వరునికి విశేష పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. శ్రీ రామచంద్ర స్వామీమహారాజ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఆలయంలో వేద మంత్రోచ్చారణల మధ్య గణపతికి అభిషేకాలు, అలంకరణలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహామంగళ హారతి అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. భక్తులు వినాయకుడిని దర్శించుకుని ఆశీర్వాదాలు పొందారు.
ఈ సందర్భంగా శ్రీ రామచంద్ర స్వామి మహరాజ్ మాట్లాడుతూ, ప్రతి శుభకార్యానికి ముందు విఘ్నేశ్వరుని ఆరాధించడం భారతీయ సంప్రదాయమని తెలిపారు. సంకష్టహర చతుర్థి రోజున వినాయకుడిని పూజిస్తే జీవితంలోని విఘ్నాలు తొలగి, కుటుంబాలు సుఖశాంతులతో ఉంటాయని అన్నారు.
ఈ పూజా కార్యక్రమం సమస్త లోకాల శ్రేయస్సు, ప్రజల సంక్షేమం కోసమే నిర్వహించామని తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.








