రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాసర ఆలయ పునర్నిర్మాణ మాస్టర్ ప్లాన్ కోసం రూ. 225 కోట్ల నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేయడం పట్ల ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం తన నివాసంలో ఆయన మాట్లాడుతూ, ఒకేసారి పెద్ద మొత్తంలో నిధులు కేటాయించడం ముఖ్యమంత్రి ఘనత అని కొనియాడారు.
గత పదేళ్ల కాలంలో అమ్మవారి ఆలయం శిథిలావస్థకు చేరినప్పటికీ, అప్పటి ప్రభుత్వం దీనిని పట్టించుకోలేదని ఆయన విచారం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాసర ఆలయ అభివృద్ధిపై రెండుసార్లు అధికారులతో సమీక్ష నిర్వహించి, రూ. 225 కోట్ల నిధులు విడుదల చేయడం పట్ల నియోజకవర్గ ప్రజలందరి తరపున కృతజ్ఞతలు తెలిపారు.
దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధిగాంచిన ఈ పుణ్యక్షేత్రం అభివృద్ధిపై ముఖ్యమంత్రి దృష్టి సారించడాన్ని ప్రజలు చిరస్థాయిగా గుర్తుంచుకుంటారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ నిధులతో ఆలయ పునర్నిర్మాణం, రాజగోపురాల నిర్మాణం, కోనేరు ఆధునికీకరణ, రోడ్ల విస్తరణ వంటి పలు అభివృద్ధి పనులు పూర్తవుతాయని ఆయన తెలిపారు.
ఆలయ మాస్టర్ ప్లాన్ కోసం తనికెళ్ల ఇంటిగ్రేటెడ్ కన్సల్టెన్సీ కంపెనీ రూ. 327 కోట్ల అంచనా నివేదికను రూపొందించినట్లు ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఆలయ ప్రాంగణంలో శంకుస్థాపన కార్యక్రమానికి హాజరుకావడం, తన మనవడికి అక్షరాభ్యాసం ఇక్కడే చేయించడం ఆనందంగా ఉందని ఆయన పేర్కొన్నారు.












