తిరుమలగిరి సాగర్, జూలై 6
శ్రీవేంకటేశ్వర స్వామివారిపై అచంచలమైన భక్తితో 116 ఏళ్ల వయస్సులో కాలినడకన తిరుమలకు చేరుకున్న తమిళనాడుకు చెందిన వృద్ధ భక్తురాలు నవనీతమ్మకు టీటీడీ సోమవారం ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేసింది. ఆమె భక్తిని ప్రశంసిస్తూ సీఎం నారా చంద్రబాబు నాయుడు కూడా స్పందించారు.
శ్రీవేంకటేశ్వర స్వామివారిపై అచంచలమైన భక్తితో 116 ఏళ్ల వయస్సులో కాలినడకన తిరుమలకు చేరుకున్న తమిళనాడుకు చెందిన వృద్ధ భక్తురాలు నవనీతమ్మకు టీటీడీ సోమవారం ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేసింది.
ఇటీవల కాలినడకన తిరుమలకు వెళ్తున్న నవనీతమ్మ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఆమె భక్తిని పలువురు ప్రశంసించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా తన సామాజిక మాధ్యమాల్లో స్పందిస్తూ, భక్తికి వయస్సు అడ్డుకాదని, శ్రీవారిపై ఉన్న విశ్వాసానికి నవనీతమ్మ నిదర్శనమని పేర్కొన్నారు.
టీటీడీ చైర్మన్ ఆదేశాల మేరకు విజిలెన్స్ అధికారులు నవనీతమ్మను, ఆమె కుటుంబ సభ్యులను గుర్తించి తిరుమలకు ఆహ్వానించారు. సోమవారం ఉదయం నవనీతమ్మతో పాటు కుటుంబ సభ్యులకు వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించి, బయోమెట్రిక్ కేంద్రం నుంచి దర్శనం వరకు టీటీడీ సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
అనంతరం రంగనాయకుల మండపంలో టీటీడీ ఈఓ ముద్దాడ రవిచంద్ర వేదపండితులతో వేదాశీర్వచనం చేయించి, వృద్ధ భక్తురాలికి పట్టువస్త్రం కప్పి శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు.
ఈ సందర్భంగా నవనీతమ్మ మనవడు దిక్పతి మాట్లాడుతూ, తమ అమ్మమ్మతో పాటు కుటుంబ సభ్యులకు శ్రీవారి దర్శన భాగ్యం కల్పించిన టీటీడీ అధికారులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం భక్తులకు స్ఫూర్తిదాయకంగా నిలిచింది.












