మిర్యాలగూడ, 2024-07-27
నల్లగొండ జిల్లా వేములపల్లి మండలంలో ఆస్తి కోసం వృద్ధ తల్లిదండ్రులను కొడుకు కుటుంబం వేధిస్తున్న ఘటన కలకలం రేపింది. తమకు న్యాయం చేయకపోతే కారుణ్య మరణానికి అనుమతివ్వాలని వృద్ధ దంపతులు మిర్యాలగూడ ఆర్డీఓ ఎస్. రమణారెడ్డిని ఆశ్రయించి, వినతిపత్రం సమర్పించారు. తమకు రక్షణ కల్పించాలని వారు కోరుతున్నారు.
ఆస్తి కోసం కన్న తల్లిదండ్రులనే కొడుకు కుటుంబం వేధిస్తున్న ఘటన నల్లగొండ జిల్లా వేములపల్లి మండలంలో చోటుచేసుకుంది. తమకు న్యాయం చేసి, ప్రాణరక్షణ కల్పించాలని కోరుతూ వృద్ధ దంపతులు మిర్యాలగూడ ఆర్డీఓ ఎస్. రమణారెడ్డిని ఆశ్రయించారు. ఒకవేళ తమకు న్యాయం జరగని పక్షంలో కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ ఆర్డీఓకు వినతిపత్రం సమర్పించారు.
వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామానికి చెందిన గగ్గనపల్లి బుచ్చిరెడ్డి, అనసూయ దంపతులు తమకున్న ఆస్తిని ఇద్దరు కుమారులకు సమానంగా పంచినట్లు తెలిపారు. అయితే తమ వృద్ధాప్య వైద్య ఖర్చుల కోసం ఉంచుకున్న మూడెకరాల 11 గుంటల భూమిని తమను పోషిస్తున్న మనవడి పేరున రిజిస్ట్రేషన్ చేయడంతో, ఆ భూమిలో వాటా కావాలంటూ పెద్ద కుమారుడు శ్రీనివాస్‌రెడ్డి కుటుంబ సభ్యులు తమను వేధిస్తున్నారని బాధితులు ఆరోపించారు.
ఇదే క్రమంలో గతంలో వీల్‌చైర్‌లో ఉన్న వృద్ధుడిపై పెద్ద కోడలు చెప్పుతో దాడి చేసిన ఘటనకు సంబంధించి కేసు నమోదైందని, అయినప్పటికీ వారి వేధింపులు ఆగలేదని వృద్ధ దంపతులు పేర్కొన్నారు. కేసును ఉపసంహరించుకోవాలని, లేకపోతే ట్రాక్టర్‌తో తొక్కిస్తామని బెదిరిస్తున్నారని ఆరోపించారు.
ఈ విషయంపై వేములపల్లి పోలీసులను ఆశ్రయించినప్పటికీ తమ ఫిర్యాదుపై తగిన విధంగా స్పందించలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తమపై పోలీసులు కూడా దురుసుగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. కొడుకు, కుటుంబ సభ్యుల వేధింపులు, పోలీసుల నిర్లక్ష్యంతో తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు.
దీంతో తమకు న్యాయం చేయాలని, ప్రాణరక్షణ కల్పించాలని, తమను వేధిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ మిర్యాలగూడ ఆర్డీఓ ఎస్. రమణారెడ్డికి వృద్ధ దంపతులు వినతిపత్రం అందజేశారు. తమ గోడును పట్టించుకోకుండా న్యాయం జరగని పక్షంలో కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని కన్నీటి పర్యంతమవుతూ వేడుకున్నారు. బాధితుల ఫిర్యాదుపై అధికారులు తక్షణమే స్పందించి తమకు రక్షణ కల్పించాలని వారు కోరుతున్నారు.












