నిర్మల్ పట్టణంలో పండ్ల వ్యాపారం ముసుగులో గంజాయి అక్రమ రవాణా, విక్రయాలకు పాల్పడుతున్న ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి సుమారు 1 కేజీ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే దురుద్దేశంతో నిషేధిత గంజాయి వ్యాపారంలోకి దిగినట్లు పోలీసులు గుర్తించారు. మహారాష్ట్రలోని భోకర్ ప్రాంతం నుంచి గంజాయిని కొనుగోలు చేసి, నిర్మల్‌కు తరలించి విక్రయిస్తున్నట్లు సమాచారం అందింది.
విశ్వసనీయ సమాచారం మేరకు, జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, నిర్మల్ ఏఎస్పీ సాయి కిరణ్ పర్యవేక్షణలో పోలీసులు నారాయణ థియేటర్ సమీపంలో ప్రత్యేక దాడి నిర్వహించారు. ఈ క్రమంలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల రాకను గమనించిన నిందితుడు, తనను తాను గాయపరచుకోవడానికి, గోడకు తల కొట్టుకోవడానికి ప్రయత్నించినట్లు సమాచారం.
నిందితుడి నుంచి సుమారు 1 కేజీ గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు నిర్మల్ టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ బి.సమ్మయ్య తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, నిందితుడిని న్యాయస్థానంలో హాజరుపరచగా, రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ చేపట్టిన 'గాంజా గస్తీ' కార్యక్రమంలో భాగంగా ఈ అరెస్ట్ జరిగినట్లు వివరించారు.
జిల్లాలో గంజాయి వంటి మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రజలు ఇలాంటి అక్రమ కార్యకలాపాలపై డయల్ 100 లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని ఇన్స్పెక్టర్ సమ్మయ్య విజ్ఞప్తి చేశారు.












