మండల కేంద్రమైన ముధోల్ లోని సాయి నగర్ లో ఐసీఐసీఐ బ్యాంక్ సమీపంలో పెద్ద మొత్తంలో ఇసుక డంప్ చేయబడింది. సుమారు 7 నుండి 8 పెద్ద వాహనాల సామర్థ్యం గల ఇసుక ఇక్కడ నిల్వ చేయబడింది. ఈ వ్యవహారంపై అధికారులు మౌనం వహించడం స్థానికుల్లో అనుమానాలను రేకెత్తిస్తోంది.
శుక్రవారం ఉదయం నుండి ఇసుక వాహనాలు ఇక్కడ నిలుపుదల అవుతూనే ఉన్నాయని, అయితే ప్రభుత్వ అనుమతులు ఉన్న ఇసుకనా లేక అక్రమంగా తరలించిన ఇసుకనా అని పరిశీలించే అధికారులు ఎవరూ లేరని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ పథకాల కింద ఇళ్లు నిర్మించుకునే వారికి ఇసుక అనుమతులు నిరాకరిస్తున్న అధికారులు, ప్రైవేట్ నిర్మాణాలకు ఎక్కడి నుండి ఇసుక వస్తుందో ఎందుకు మౌనంగా ఉంటున్నారో అర్థం కావడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
గతంలో ముధోల్ లో ఇసుక తరలింపు విషయంలో అనేక వివాదాలు తలెత్తిన సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. అయినప్పటికీ, ఇంత పెద్ద మొత్తంలో ఇసుక డంప్ అవుతున్నా అధికారులు స్పందించకపోవడం వారి విధేయతపై అనుమానాలను రేకెత్తిస్తోందని విమర్శలు వస్తున్నాయి. నియమ నిబంధనలు అందరికీ ఒకేలా వర్తింప చేయాలని, ఇలాంటి వ్యవహారాలు సరికాదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయంపై ముధోల్ ఎస్సై బిట్ల పెర్సిస్ ను సంప్రదించగా, తాను హైకోర్టు పనిపై వెళ్తున్నానని, తిరిగి వచ్చిన వెంటనే దర్యాప్తు చేస్తామని తెలిపారు. తహసీల్దార్ ను ఫోన్ ద్వారా సంప్రదించే ప్రయత్నం చేయగా, ఆయన సమాధానం ఇవ్వడానికి నిరాకరించినట్లు సమాచారం. అధికారుల నుండి సరైన స్పందన రాకపోవడంతో ఈ వ్యవహారంపై మరింత విచారణ అవసరమని తెలుస్తోంది.











