ఆన్లైన్ రమ్మీ వ్యసనానికి బానిసై అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఒక వ్యక్తి తన తల్లి, భార్యను హత్య చేసి, తన ఇద్దరు పిల్లలను రైలు కింద పడేసి ఆత్మహత్య చేసుకున్న దారుణం తిరుపతి జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటనతో ఐదుగురు మృతి చెందారు.
తిరుపతి జిల్లాలో జరిగిన ఈ హృదయ విదారక సంఘటనకు సంబంధించి పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, నారాయణవనం మండలం వెంకటకృష్ణపాలెంకు చెందిన మోహన్ అనే వ్యక్తి బుధవారం తన తల్లి చంద్రకళ, భార్య హరితలను ఇంట్లోనే హత్య చేశాడు. అనంతరం, తన ఇద్దరు పిల్లలు కౌశిక్ (14), హరిణి (12)లను స్కూల్‌కు వెళ్లి, మావయ్య చనిపోయాడని అబద్ధం చెప్పి ఇంటికి తీసుకొచ్చాడు.
పిల్లలను ఇంట్లోకి వెళ్లనీయకుండా స్కూటీపై బయట తిప్పిన మోహన్, చివరకు రైలు పట్టాల వద్దకు వారిని తీసుకెళ్లాడు. అక్కడ మోహన్ వేగంగా వస్తున్న రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సమయంలో తండ్రిని కాపాడే ప్రయత్నంలో పిల్లలిద్దరూ రైలు ఢీకొని అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
మోహన్ కొంతకాలంగా ఆన్లైన్ రమ్మీకి బానిసై సుమారు రూ.40 లక్షల వరకు అప్పులు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఉన్న ఆస్తులు, బంగారం అమ్మి అప్పులు తీర్చినా, ఇంకా అప్పుల ఒత్తిడి నుంచి బయటపడలేకపోయాడు. ఈ ఆర్థిక సమస్యలతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయని సమాచారం. భార్య హరితే బ్యూటీ పార్లర్, టైలరింగ్ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నట్లు తెలిసింది.
గురువారం ఐదు మృతదేహాలకు పోస్ట్‌మార్టమ్ నిర్వహించి, స్వగ్రామంలో అంత్యక్రియలు జరిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆన్లైన్ రమ్మీ వంటి వ్యసనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఇవి జీవితాలను నాశనం చేసే ప్రమాదం ఉందని ఈ ఘటన తెలియజేస్తోంది.







