రాష్ట్రంలో జర్నలిస్టులకు అక్రిడిటేషన్ల జారీ ప్రక్రియ నిబంధనలకు విరుద్ధంగా జరుగుతోందని, ప్రభుత్వం జారీ చేసిన జీవో 252ను సమాచార పౌర సంబంధాల శాఖ అధికారులు అపహాస్యం చేస్తున్నారని వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాడూరు కరుణాకర్ ఆరోపించారు.
తాడూరు కరుణాకర్ ఒక ప్రకటనలో మాట్లాడుతూ, కొన్ని సంఘాల నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి, మార్గదర్శకాలను తుంగలో తొక్కుతున్నారని ఆరోపించారు. అక్రిడిటేషన్ల జారీకి సంబంధించి జరిగిన సమావేశాలలో జీవోకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకున్నారని, ఈ ప్రక్రియను అడ్డుకుంటామని హెచ్చరించారు.
జీవో 252లో మార్పులు చేర్పులు చేసే అధికారం ఎవరికీ లేదని, అయినప్పటికీ జీవోకు విరుద్ధంగా నిర్ణయాలు ఎలా తీసుకున్నారని ఆయన ప్రశ్నించారు. ఏబీసీ/పీఆర్జీఐ/ఆర్ఎన్ఐ ఆమోదిత సర్క్యులేషన్ సర్టిఫికేట్లు లేని పెద్ద, మధ్యతరహా వార్తాపత్రికలకు అక్రిడిటేషన్లు ఎలా మంజూరు చేస్తున్నారని సమాచార శాఖ అధికారులను నిలదీశారు.
పెద్ద పత్రికలకు ఉదారంగా వ్యవహరిస్తూ, చిన్న పత్రికలపై వేటు వేయడం తీవ్ర అన్యాయమని కరుణాకర్ అన్నారు. జీవో ప్రకారం, 25,000 కంటే ఎక్కువ సర్క్యులేషన్ ఉన్న పత్రికలు తప్పనిసరిగా సర్క్యులేషన్ ధృవీకరణ పత్రం సమర్పించాలి. ఈ నిబంధనను ఉల్లంఘిస్తూ, అక్రిడిటేషన్ కమిటీ పెద్ద, మధ్యతరహా పత్రికలకు అక్రిడిటేషన్లు ఆమోదించినట్లు తమకు సమాచారం ఉందని తెలిపారు.
ప్రభుత్వ ఏజెన్సీలకు తక్కువ సర్క్యులేషన్ చూపించి, సమాచార శాఖలో ఎక్కువ సర్క్యులేషన్ వివరాలు చూపించి మోసం చేస్తున్న పత్రికలపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. జీవో ఎంఎస్ 252ను కచ్చితంగా అమలు చేయాలని కోరారు.












