కుంటాల మండలంలో ఇటీవల జరిగిన మొక్కజొన్న సంచుల దొంగతనం కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేయగా, మరొకరు పరారీలో ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఏప్రిల్ 4వ తేదీ అర్ధరాత్రి వెంకుర్ గ్రామ శివారులో రైతు చేనులో నిల్వ చేసిన మొక్కజొన్న సంచులను దొంగిలించినట్లు ఫిర్యాదు అందింది. కుంటాల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు.
జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల ఆదేశాల మేరకు, ఏఎస్పీ రాజేష్ మీనా నేతృత్వంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందం, సీసీ కెమెరా ఫుటేజ్, కాల్ డేటా రికార్డుల విశ్లేషణ ద్వారా నిందితులను గుర్తించింది.
నిందితుల నుంచి రూ.75 వేల నగదును స్వాధీనం చేసుకున్న పోలీసులు, వారిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అరెస్ట్ అయినవారిలో షేహెబాజ్ అహ్మద్, షేక్ అతీఫ్, మొహమ్మద్ సాహిల్ ఉద్దిన్, షేక్ జలాల్ అలియాస్ అర్బాజ్ ఉన్నారు. షేక్ నోమన్ అలియాస్ మన్నాన్ అనే మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు సమాచారం.
కేసును త్వరితగతిన ఛేదించిన పోలీసు అధికారులను, సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు. పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.











