మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని బాదంపల్లి గ్రామ సమీపంలో గోదావరి నది ఒడ్డున ఆదివారం వన్యప్రాణులను వేటాడేందుకు అమర్చిన పేలుడు పరికరాలు పేలడంతో పలు బర్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన గ్రామస్థుల్లో భయాందోళనలు రేకెత్తించింది.
వన్యప్రాణులను వేటాడేందుకు గుర్తుతెలియని వ్యక్తులు అమర్చిన పేలుడు పరికరాలను మేత కోసం వెతుకుతున్న బర్ల తినడంతో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ పేలుళ్లలో పలు బర్లకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన పశువులను వైద్యుల వద్దకు తరలించారు.
గ్రామస్థులు ఈ సంఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ప్రమాదకర పరికరాల వల్ల అమాయక పశువులు బలవుతున్నాయని, అధికారులు వెంటనే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
మూడు రోజుల క్రితం ఇదే ప్రాంతంలో జరిగిన ఇలాంటి సంఘటనలో నాలుగు మేకలు మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. దీంతో ప్రజల్లో భయం మరింత పెరిగింది.
జన్నారం ఎస్ఐ ఉదయ్ కిరణ్ మాట్లాడుతూ, ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, బాధ్యులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.








