మంచిర్యాల జిల్లా (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 21
రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆదేశాల మేరకు, మంచిర్యాల డీసీపీ, జైపూర్ ఏసీపీ సూచనలతో, జైపూర్ సీఐ కె. నవీన్ కుమార్ ఆధ్వర్యంలో భీమారం గ్రామం లంబాడి తండాలో పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ క్రమంలో అనుమానాస్పద వ్యక్తులను విచారించి, ఇళ్లలో, పరిసర ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు.
రామగుండం పోలీస్ కమిషనరేట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు, డీసీపీ మంచిర్యాల ఎ. భాస్కర్, జైపూర్ ఏసీపీ ఎ. వెంకటేశ్వర్ సూచనలతో, జైపూర్ సీఐ కె. నవీన్ కుమార్ ఆధ్వర్యంలో భీమారం గ్రామం లంబాడి తండాలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.
ఈ సందర్భంగా అనుమానాస్పద వ్యక్తులను విచారించడంతో పాటు ఇళ్లలో, పరిసర ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. వాహనాల తనిఖీల్లో భాగంగా సరైన పత్రాలు, నంబర్ ప్లేట్ లేని 45 వాహనాలను సీజ్ చేశారు. అలాగే ప్రభుత్వం నిషేధించిన గుడుంబాను స్వాధీనం చేసుకుని సంబంధిత కేసు నమోదు చేశారు.
ఈ సందర్భంగా సీఐ కె. నవీన్ కుమార్ మాట్లాడుతూ, తల్లిదండ్రులు తమ పిల్లలపై నిరంతరం నిఘా ఉంచి గంజాయి, మద్యం తదితర మాదకద్రవ్యాలకు అలవాటు పడకుండా చూడాలని సూచించారు. అలాగే యువత ఆన్లైన్ గేమింగ్‌కు బానిస కాకుండా తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. గంజాయి వంటి మత్తు పదార్థాలకు బానిసైన వారిని డీ-అడిక్షన్ సెంటర్లకు పంపించి చికిత్స ద్వారా సాధారణ జీవితంలోకి తీసుకురావచ్చని పేర్కొన్నారు.
అదేవిధంగా సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రతి ఇంటి వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం వల్ల నేరాల నియంత్రణతో పాటు నేరస్థులను గుర్తించడంలో ఎంతో ఉపయోగపడుతుందని ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో జైపూర్ ఎస్ఐ భూమేష్, భీమారం ఎస్ఐ ఎ. రాజేందర్ మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.











