కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో చట్టం కింద కేసు నమోదైనట్లు వార్తలు వస్తున్నాయి. ఒక మైనర్ బాలిక అత్యాచారం ఆరోపణలపై ఈ కేసు నమోదైనట్లు తెలుస్తోంది.
తమతో బలవంతంగా మద్యం తాగించి అత్యాచారం చేశారని బండి భగీరథ్ పై 17 ఏళ్ల మైనర్ బాలిక హైదరాబాద్ బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. శుక్రవారం రాత్రి బాలిక ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం.
నగరంలోని మోహినాబాద్ ఫామ్ హౌస్ లో ఏప్రిల్ 31న ఈ ఘటన జరిగినట్లు మైనర్ బాలిక తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిసింది. మొదట్లో పోలీసులు కేసు నమోదు చేయడానికి వెనకడుగు వేసినప్పటికీ, బాలిక తల్లిదండ్రుల ఒత్తిడితో కేసు నమోదు చేసినట్లు సమాచారం.
ఈ ఆరోపణలపై బండి భగీరథ్ కూడా స్పందించారు. బాలిక కుటుంబం తనను బ్లాక్ మెయిల్ చేస్తోందని, పెళ్లి చేసుకోకపోతే వేధింపుల కేసు పెడతామని బెదిరిస్తూ రూ. 5 కోట్లు డిమాండ్ చేస్తున్నారని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఇప్పటికే రూ. 50 వేలు ఇచ్చినా వేధింపులు ఆగలేదని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ప్రస్తుతం పోలీసులు ఇరువర్గాల ఫిర్యాదులను స్వీకరించి, ఈ ఆరోపణలపై లోతుగా విచారణ జరుపుతున్నారు. ఈ కేసులో వాస్తవాలు విచారణ అనంతరం తేలనున్నాయి.












