హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో శుక్రవారం తెల్లవారుజామున దారుణ హత్య జరిగింది. మాజీ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రాయ్ భార్య సునంద తన నివాసంలోనే దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. క్లూస్ టీమ్ సహాయంతో ఘటనా స్థలంలో వేలిముద్రలను సేకరిస్తున్నారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం, ఈ హత్యలో నేపాలీ గ్యాంగ్ ప్రమేయం ఉన్నట్లు సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. ఇంట్లో పనిచేస్తున్న నేపాలీ మహిళ కల్పన, మరికొందరితో కలిసి ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.
సునంద ఒంటరిగా ఉన్న సమయంలో కల్పన తన గ్యాంగ్‌కు సమాచారం ఇచ్చిందని, దీంతో వారు వచ్చి హత్య చేసి, ఇంట్లోని నగదు, బంగారాన్ని దోచుకుని పారిపోయారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.








