కరీంనగర్, జూలై 20
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని రాస్ అల్ ఖైమాలో ఎమిరేట్స్ తెలంగాణ కల్చరల్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం మహంకాళి అమ్మవారి బోనాల మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ వేడుకలకు మైత్రి గ్రూప్స్ వ్యవస్థాపకుడు కొత్త జైపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విదేశీ గడ్డపై తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను సజీవంగా ఉంచుతూ బోనాలు, బతుకమ్మ వంటి పండుగలను నిర్వహించడం అభినందనీయమని ఆయన అన్నారు.
విదేశీ గడ్డపై తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను సజీవంగా ఉంచుతూ బోనాలు, బతుకమ్మ వంటి పండుగలను ఘనంగా నిర్వహించడం అభినందనీయమని మైత్రి గ్రూప్స్ వ్యవస్థాపకుడు కొత్త జైపాల్ రెడ్డి అన్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని రాస్ అల్ ఖైమాలో ఎమిరేట్స్ తెలంగాణ కల్చరల్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన మహంకాళి అమ్మవారి బోనాల మహోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, విదేశీ గడ్డపై తెలంగాణ ఆత్మను సజీవంగా నిలుపుతూ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు చేరవేస్తున్న అసోసియేషన్ ప్రతినిధులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమానికి దుబాయ్, అబుదాబి, షార్జాతో పాటు యూఏఈలోని వివిధ ఎమిరేట్స్ల నుంచి సుమారు 400 మంది తెలంగాణ ప్రవాసులు కుటుంబ సమేతంగా హాజరై భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకల్లో పాల్గొన్నారు.
అసోసియేషన్ ఆధ్వర్యంలో వరుసగా నాలుగో ఏడాది నిర్వహించిన ఈ ఉత్సవంలో గౌరమ్మ పూజ, బోనాల సమర్పణ, కుంకుమార్చన, మహాహారతి, దీపోత్సవం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పట్టు చీరలు ధరించిన మహిళలు తలపై బోనాలు మోసుకుంటూ నిర్వహించిన ఊరేగింపు, ఒగ్గు డోలు మోతలు, పోతురాజుల విన్యాసాలు విదేశీ నేలపై తెలంగాణ సంస్కృతిని ఆవిష్కరించాయి.
ఎమిరేట్స్ తెలంగాణ కల్చరల్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కిరణ్ కుమార్ పీచర, అధ్యక్షుడు జగదీష్ రావు మాట్లాడుతూ, విదేశాల్లో జన్మించిన భావితరాలకు తెలంగాణ పండుగల విశిష్టతను పరిచయం చేయడమే సంస్థ ప్రధాన లక్ష్యమని తెలిపారు. అనంతరం భక్తులకు ప్రసాదం పంపిణీ చేసి, తెలంగాణ సంప్రదాయ వంటకాలతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
విదేశాల్లో ఉన్నప్పటికీ స్వగ్రామంలో బోనాలు జరుపుకున్న అనుభూతి కలిగిందని తెలంగాణ ప్రవాసులు నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఉపాధ్యక్షులు శ్రీనివాస్ ఎలిగేటి, ప్రధాన కార్యదర్శి రాణి కొట్ల, సంయుక్త కార్యదర్శి శేఖర్ గౌడ్ గుండవేని, కోశాధికారి తిరుమల్ రావు బీరెల్లి, మాజీ అధ్యక్షుడు రాధారపు సత్యం, కార్యవర్గ సభ్యులు, మహిళా విభాగ ప్రతినిధులు, వాలంటీర్లు, యూఏఈ నలుమూలల నుంచి వచ్చిన తెలంగాణ ప్రవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.












