నిర్మల్ జిల్లా కడెం మండలంలోని పెద్ద బెల్లాల్ గ్రామంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా అవగాహన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల పాల్గొన్నారు. మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలు, రోడ్డు భద్రత వంటి అంశాలపై ఆమె గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా, జిల్లా ఎస్పీ ఆన్లైన్ మోసాలు, మత్తు పదార్థాల వాడకం, మైనర్ డ్రైవింగ్ వల్ల కలిగే ప్రమాదాల గురించి వివరించారు. సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, పిల్లలకు సరైన మార్గదర్శనం చేయాలని సూచించారు.
రోడ్డు భద్రతపై మాట్లాడుతూ, డ్రంక్ అండ్ డ్రైవ్, సెల్ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపడం వంటి ప్రమాదకర చర్యలకు దూరంగా ఉండాలని, 18 ఏళ్ల లోపు వారికి వాహనాలు ఇవ్వవద్దని తల్లిదండ్రులను కోరారు.
గంజాయి, గుడుంబా వంటి మత్తు పదార్థాలు కుటుంబాలను నాశనం చేస్తాయని హెచ్చరించిన ఎస్పీ, అక్రమ విక్రయాల సమాచారాన్ని పోలీసులకు తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమానికి సుమారు 400 మంది ఉపాధి హామీ కార్మికులు హాజరయ్యారు.












