యాదవ సంస్కృతి, సంప్రదాయాలకు గంగమ్మ తల్లి జాతరలు ప్రతీక అని మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మా రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మిర్యాలగూడ మండలం తడకమళ్ళ గ్రామంలో జరిగిన లింగమంతుల స్వామి, సౌడమ్మ తల్లి జాతరలో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే బత్తుల లక్ష్మా రెడ్డి, యాదవ సమాజపు ఆచార వ్యవహారాలను, ఐక్యతను ప్రతిబింబించే ఈ సంప్రదాయాలను కొనసాగించాలని సూచించారు. జాతర స్ఫూర్తితో యాదవులు ఐక్యంగా ఉండి అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా, గజ్జెల లాగులు ధరించి, భేరి చప్పుళ్ల నడుమ యాదవ పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు సామూహిక బోనాలను సమర్పించి, భక్తులు యాట మొక్కులు చెల్లించుకున్నారు.
ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు గుండు నరేందర్ గౌడ్, గ్రామ సర్పంచ్ మేక సైదులు, ఉపసర్పంచ్ కుసుమ సుదర్శన్ రెడ్డి, వార్డ్ సభ్యులు, యాదవ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.












