షహీద్ భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ల 95వ వర్ధంతి సందర్భంగా అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లాలో యువజనోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా నిర్వహించనున్న కార్యక్రమాలకు సంబంధించిన గోడ పత్రికను ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్లో SI విష్ణువర్ధన్ మరియు ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి మేస్రం భాస్కర్ ఆవిష్కరించారు.
SI విష్ణువర్ధన్ మాట్లాడుతూ, యువత మాదకద్రవ్యాలు, గంజాయి, డ్రగ్స్ వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, క్రీడలలో చురుగ్గా పాల్గొని సమగ్ర అభివృద్ధి సాధించాలని పిలుపునిచ్చారు. "స్టాప్ డ్రగ్స్ – స్టార్ట్ స్పోర్ట్స్" నినాదంతో ఈ కార్యక్రమాలు నిర్వహించబడతాయని తెలిపారు.
ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి మేస్రం భాస్కర్ తెలిపిన వివరాల ప్రకారం, మార్చి 1 నుంచి 23వ తేదీ వరకు “స్టాప్ డ్రగ్స్ – స్టార్ట్ స్పోర్ట్స్” పేరుతో ఈ ఉత్సవాలు నిర్వహించబడతాయి. ఈ ఉత్సవాలలో భాగంగా క్రికెట్, కబడ్డీ, వాలీబాల్ వంటి క్రీడా పోటీలతో పాటు, వ్యాసరచన, చిత్రలేఖనం, ఉపన్యాస పోటీలు కూడా ఉంటాయి.
ఇవే కాకుండా, రక్తదాన శిబిరాలు, యువ కవులు, గాయకుల సమ్మేళనాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రముఖుల సందేశాలు వంటి అనేక విభిన్న కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. భారత స్వాతంత్య్ర యోధులైన భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ల వీరోచిత త్యాగాలను యువత స్మరించుకోవాలని, చెడు అలవాట్లను విడనాడి క్రీడలు, విద్య, సాంస్కృతిక కార్యకలాపాలలో చురుగ్గా పాల్గొనాలని సభ్యులు, నాయకులు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ ఆదిలాబాద్ జిల్లా నాయకులు రవీందర్, సాయి, ప్రవీణ్, దిలీప్, కైలాష్, భగవాన్ తదితరులు పాల్గొన్నారు.












